పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేలుకొన్నాను. ఈ విషయమై యిక మనసున కేమియు బాధ కలుగజేయను. నన్ను విడిచి మీదారినిపొండి; నేను నామేకలపాలు పితుకుకొనుచు నాపాట్లు నేను పడుచుండెదను" అని నిస్పృహతో బలికెను.

దయార్ద్రమానసుఁడైన బహుమానుఁడు ప్రమతియొక్క యనువర్తనమునకు ధైర్యమునకును మెచ్చుపుట్టి, మోహాంధకార నిమగ్నుఁడై యున్న రాజనందనుఁడు జనకుని యాజ్ఞా మాత్రమునఁ బ్రాణసమానయైన యామానినిని విడువగల వాడు కాఁడని రూఢిగా నెఱిఁగినవాడు కాన, ఏలగుననైన నా కాముకీకాముకుల నేకీభవింప జేయు మార్గమును వెదకి యందువలన జిరకాలమునుండి తనమనసులోనున్న యొక యాలోచనను ఈడేరుచుకొనవలె నని నిశ్చయించెను. సింహళ ద్వీపాధినాధుఁ డగు సుమిత్రుఁడు నిజముగా బశ్చాత్తప్తుడయి యున్నా డన్నసంగతి బహుమానుఁడు చిరకాలముక్రిందనే యెఱిగియుండెను. ఇప్పుడు బహుమానుడు చంద్రవర్మకు ప్రియమిత్రుడుగా నుండినను, తన పూర్వప్రభువును జన్మ భూమిని మఱియొకసారి పోయిచూడవలెనను నాశనుమాత్రము బొత్తిగా వదలి పెట్టినవాడు కాడు. కాబట్టి రామవర్మను ప్రమతిని తనతోఁడ సింహళద్వీపమునకు రావలసినదనియు, అచ్చట సుమిత్రుని మధ్యవర్తిత్వమున జంద్రవర్మవలన క్షమాపణమును వడసి వివాహమున కనుమతిని పొందువఱకును మిమ్ముఁ గాపాడుట కారాజు నొడఁబఱిచెద ననియుఁ చెప్పెను.