పుట:Sukavi-Manoranjanamu.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాంత విజ్ఞప్తి

సీ.

సుకవీంద్రులార! సర్వకలాకలాపర
             త్నములార! మును లక్షణములు పెక్కు
గలుఁగఁగఁ గ్రోతలక్షణ మేల రచియించె
             నితఁ డని మీకు నుపేక్ష వలదు
తొల్లిటివారును దోచిన యటుల వే
             ర్వేర రచించినవారు గారె
నేనును దద్రీతినే రచియించితి
             నారసి మీకు గ్రాహ్యంబులైన
వీటిని గొనుండు తప్పులు వాటిలినఁ ద
గుదయ దనర దిద్దుడు తద్ద గ్రంథసమితి
నరసి, విబుధులఁ దెలసి సమంచితముగ
సంఘటించితి కుక్కుటేశ్వరుని కరుణ.

582


సీ.

అవనిపై శాలివాహనశకవర్షముల్
             జలనిధి జలజాత జాత శైల
కైరవమిత్ర సంజ్ఞాన్వితమైన ప్ర
             జోత్పత్తి శరదాశ్వయుజ సితేత
రచ్ఛదైకాదశీ రౌహిణేయదినంబు
             వరకు నీపేర సద్భక్తి మీర
నొనరిచి సుకవిమనోరంజనం బను
             లక్షణరాజంబు రాజమౌలి
నీకు నర్పించి తటుగాన నిధ్ధరిత్రి
నారవిశశాంకతారాగ్రహంబు గాఁగ
సుకవిగృహముల విలసిల్లుచుండజేయు
మీనశశిరథాంగ! శ్రీ కుక్కుటేశలింగ!

583


ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ