పుట:Sukavi-Manoranjanamu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'అనుత్తమ పురుష = ఉత్తమ పురుష వ్యతిరిక్తమైన, క్రియాసు = క్రియలందలి,ఇతః = ఇకారమునకు, నిత్యం = నిత్యముగాను సంధి గద్దు చెల్లి రసురులు; ప్రోచి రమరులు; చేసితి వచ్యుతుని పూజ; ఉత్తమ పురుషకైతే– కొలిచితి నంబను, విడిచితి మన్యులను. అన్నది కిమాదికము గనుక క్రియాగ్రహణాన నంటలేదు."
అని యెవరి మతానుసారము నాయాయి ప్రకారములు వ్రాసినారు.14
సూత్రార్థము పరిశీలించితే ప్రథమ, మధ్యమ పురుషములకు సంధి నిత్య మనిన్ని, ఉత్తమ పురుషకు వికల్ప మనిన్ని కనుపించుచున్నది. ఈలాగు వ్రాయక సూత్రమందు లేని యర్థమును సామరస్యము కొఱకు వ్రాసినంత మాత్రమున నేమి వినియోగము!15
అప్పకవి లాక్షణికచక్రవర్తి గారు (మహాకవి ప్రయోగముల)నేమి పరిశీలించిరో!16
ఉద్యోగ పర్వము (3-36)
మ.

గురు భీష్మాదులు సూచుచుండ సభ మీకుం గీడు నా డట్లు ము
ష్కరులై చేసిరి యంత చేసియును బశ్చాత్తాపముం బొందనో
పరు వా రెన్నఁడు నట్టిచోటఁ గృపయుం బంధుత్వముందక్కు మె
వ్వరు గోపింపరె యాదురాత్ముకుల గర్వ క్రౌర్యముల్ సూచినన్.

17
పారిజాతాపహరణము (5–47)
క.

విన నేర్చిరి బధిరులుగను
గొన నేర్చిరి యంధకులు లఘుత్వము మీఱన్
జన నేర్చిరి వికలాంగులు
యనిమిషతరు కుసుమ సౌరభావేశమునన్.

18
కవుల షష్ఠము
క.

మనుజులలో సత్కర్మం
బొనరుచువారెల్ల దండ్యులో వారలలోఁ
గనుఁగొనఁ గొందఱె దండ్యులొ
యనవుడు హరిభటుల కనిరి యప్పార్శ్వచరుల్.

19