పుట:Sukavi-Manoranjanamu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్లో.

సభాయాం క్లిశ్యమానస్య, ధార్తరాష్ట్రైః దురాత్మభిః
సహసోత్పతితః క్రోధః, కర్ణం దృష్ట్వా ప్రశామ్యతి'

అని యున్నది (దానికి తెలుగు భారతమున) పద్యము—
క.

కౌరవులు సేయు నవమతి
కారణమునఁ గోపమెత్తుఁ గర్ణుని వదనాం
భోరుహముఁ గనుఁ గొనఁగ శమ
మారు న్నావశముగాక యంతన బుద్ధిన్."

20
తనకు కర్ణు డన్నని యెఱింగిన పిమ్మట ధర్మరాజు దుఃఖాక్రాంతుడై యనుకొనే (సందర్భములోనిదీ పద్యము). సభయందు దుర్యోధనాదులు ద్రౌపదీమానభంగము సేయునపుడు వారిపై క్రోధము ప్రజ్వలించేది. కర్ణుని నన్నని యెఱుంగకపోయినా ధర్మరాజు ఉత్తమోత్తముడు గావున (అతనికి కర్ణుని మొగము చూడగానే) శాంతి నిండేది. "అన్నగాకపోతే యెందుకు నా హృదయము చల్లగా నుండేది?" (అని) విమర్శ చేసుకోనైతినని (ధర్మరాజు) పరితపించుచున్నవాడని భావము. అప్పకవిగారు " 'శ్రమ మారున్' అనే వ్రాసియుందురు. లేఖకప్రమాద మనుకోరాదా" అంటే, రేఫ సీసమాలికయందు, “శ్రమ మారె, పొంగారె" అని వ్రాసి, అర్థమున్ను శ్రమమారుట = బడలిక తీరుట, పొంగారుట = పొంగు తీరుట అని వ్రాసినారు.
ఱకార సీసమాలిక యందున్ను (2-197)

"...ఆఱు సంఖ్యాపద మాఱడి యాఱిక
             పంట చిచ్చాఱె పాపంబు లాఱె
నాఱని తేజము లాఱిన ముత్తెంబు
             తడి యాఱె శ్రమ మాఱె తాప మాఱె...'

21
అర్థము చిచ్చాఱుట, పాపము లాఱుట, ఆఱని తేజము, ఊటాఱిన ముత్యములు, కోక తడి యాఱుట, శ్రమ మాఱుట" అని రేఫ ఱకారముల క్రమమందు 'శ్రమ మాఱె’ అని వ్రాసి అర్థమున్ను స్పష్టముగా నదేప్రకారము వ్రాసినారు. కావున (ఇది) లేఖకప్రమాదముగాదు. అప్పకవిగారి పాండిత్యమహిమయే. 22