పుట:Sukavi-Manoranjanamu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21. ఫ్లుతయతి

లక్షణము
క.

దూరాహ్వానము లందును
హా రోదన గాన సంశయార్థము లందున్
సూరి నుత ప్లుతాన్వితంబులు
నారయ నుభయంబునకును యతు లలరు ధరన్.

452
అర్థము:- పిలుచుటయందు, రోదనమందు, గానమందు, సంశయమందు ప్లుతముతో గూడిన హల్లులు స్వరములకు, వ్యంజనములకు యతులొప్పును. ఈ నాలుగు విధములు ప్లుతయతులని చిరకాలప్రసిద్ధి. లాక్షణికులు స్వరములకు మాత్రమే చెప్పినారు గాని వ్యంజనములకు చెప్పలేదు. అప్పకవి గారయితే ఉభయముకు చెప్పినారు గాని వేఱువేఱైన ప్లుత-కాకు స్వరములను ఏకము చేసినారు. దళవిధయతులలోను ప్రసిద్ధమయినది ప్లుతము. మిగిలిన యతులలో ప్రసిద్ధమైనది కాకుస్వరము. బుద్ధిమంతులు పరిశ్రమించితే ఆ యాయాభేదములు స్పష్టముగానే యున్నవి. 453
'దూరాహ్వానము', హల్లుకు
వసుచరిత్రము (4–27)
శా.

రాజీవాక్షుల నేచు పాతకివి చంద్రా రాజవా నీవు నీ
రాజత్వంబునఁ జక్రముల్ మనియెనో రంజిల్లి సత్సంతతుల్
తేజంబందెనొ డిందెనో యహిభయోద్రేకంబు, నే జెల్ల రే
రాజై పుట్టుట రశ్మిమాత్ర ఫలమా రాజౌట దోషార్థమా.

454
పిల్లలమఱ్ఱి వీరన్నగారి శాకుంతలాపరిణయము (3-188)
మ.

జననం బొందితి దుగ్ధవారినిధి నా సర్వేశు జూటంబవై
జనునే ప్రొద్దు ప్రశంససేయ నవతంసంబైతి నీ ప్రాభవం
బునకున్ బాంథజనాపకారి యగు నా పూవిల్తునిం గూడి నా
పని దుష్కీర్తిగఁ దిట్టునం బడకు చంద్రా! రోహిణీవల్లభా!

455
'చంద్రా' అనుచోట్ల. 456