పుట:Sukavi-Manoranjanamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
లాక్షణికులు ర ల లకు లక్ష్యములు వ్రాసినారు. అప్పకవిగారు – సంస్కృతమందు రేఖా, లేఖా శబ్దములు రెండు గలవుగాన నీ రెండు పద్యములందు చెప్పిన రేఖాశబ్దము మొదలి (వర్ణము) తృతీయాంతస్థమని యెఱుంగునది. తృతీయాంతస్థమనగా లకారమనుట'...
వసుచరిత్రము (3-66) నందు
శా.

ఓ లంబాలక యోల యోల యన నోలోలంచు మేలంబునన్
లోలంబాలక యోర్తుగ్రుంకి బిసవల్లు ల్దున్మి తూఁటాడి కేం
గేలం బూని తటాలున న్నెగసె నక్షీణాంబునాథాంబుజా
క్షీలోకంబు జయించి వారల యశఃశ్రీఁ దెచ్చు చందంబునన్.

273
ఈ పద్యము రెండవచరణము మొదలను 'లోలంబాలక'యని కవిహృదయము. ఇదిగానక కొందఱు "ఇందిందిర శ్చంచరీకో రోలంబో బంభరోపి చ" అని నిఘంటున నున్నదని 'రోలంబాలక' యని చదువుదురు. ఇట్లని రామరాజభూషణుని తలంపు గాదు' అని అప్పకవిగారు అన్నారు.274
కొందఱు 'ఓ లోలాఁబక' అనిన్నీ, లో = నీటిలోను, లంబ = వ్రేలుచున్న, అలక = ముంగురులు గలదనిన్ని రెండుచోట్ల దిద్దినారు[1]. రల లకు (యతి) నంగీకరించలేదు. (కాని, దిద్దుబాటు కాని ప్రయోగములున్నవి.)275
శ్రీనాథుని కాశీఖండము (6-210)
శా.

హాలాపాన మొనర్చి యిద్దరును నన్యోన్యంబు మత్తిల్లి రౌ
కేలీనృత్తవినోదకందుకమణిక్రీడావిహారక్రియా
లీలాహాస్యకలాప్రసంగముల నుద్దేశించి వర్తింతు రె
క్కాలంబున్ ఘటజన్మ కాశినడుమన్ గర్వించి యద్దేవతల్.

276
శ్రీనాథుని మరుత్తచరిత్ర
సీ.

శాశ్వతవిశ్వవిశ్వంభరాచక్ర మీ
             రాజకుమారుఁ డేలంగ గలఁడు.....[2]

277
  1. ఇట్లు దిద్దినవాడు కూ. తిమ్మన. చూ. ల. సా. సం. 2-194.
  2. ఈ పద్యపాదము రంగరాట్ఛందమున 'సునందనచరిత్ర' లోనిదిగా ఉదాహరింపబడినది, చూ. రంగ. చంద. 3-274.