పుట:Sukavi-Manoranjanamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(ర ల ల కనగా) ఱకారముకు లకారముకున్ను, రేఫముకు లకారముకున్ను (అని అర్థము.) 'రశ్చఱాశ్చరౌ' అని ఏకశేషము. వకారముకు ప బ ల కున్ను, ద డ లకు, ల ళ లకు అభేదయతులు చెల్లును. ల ళ లకు, వ ప బ లకు నందఱు లాక్షణికులు నభేదయతి నంగీకరించినారు. కొందఱు ర ల లకున్ను, కొందఱు ద డ లకున్ను అంగీకరించినారు. అప్పకవిగారు సుప్రసిద్ధముగా మహాకావ్యలక్ష్యములుగల ర ల లకు, ద డ లకు నభేద మొప్పక, నొకటియు లక్ష్యములేని ల డ లకు నభేద మంగీకరించినారు. వ బ లకు నభేదమనిన్ని వ-ప ఫ భ లకు నభేదవర్గమనిన్ని నిర్ణయించినారు. (అయితే,)268
క.

'వఫయో రభేద' యనియెడు
నెపమున ప ఫ బ భ లు వాకు నిజముగ వడులౌ
(నుపమింపవచ్చుఁ గృతులం
దుపనిషదుచితార్థసూక్తు లొలసినచోటన్.)

269
అని లాక్షణికులందఱు 'వపయోరభేద' మే ముఖ్యము చేసినారు. వ ప బ లకు నభేదము. వ ఫ భ లకు, గ డ లకు ధ డ లకు నభేదవర్గము.270
లక్ష్యములు
శ్రీనాథుని నైషధము (1-112)
క.

కేలాదిరాయ యభినవ
లీలా మకరాంక చంద్ర రేఖాంకుర చూ
డాలంకార పదాంబురు
హాలింగిత సుఖిత నిర్మలాంతఃకరణా!

271
భాస్కరుని రామాయణము (యుద్ధ. 2333)
క.

దానవసుందరు లత్తఱి
జానకి నందలముమీఁద సమ్మద మొదవం
గా నిలుప శారదాభ్రవి
లీనత నేపారు చంద్రరేఖయపోలెన్.

272