పుట:Stree Neetideepika.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దోషముల నెన్నుచుండుట తుచ్ఛగుణము
కాన, మంచివా రటుచేయు మాన వలయు. 86.

తే.గీ. దైవవశమున నన్యుల తనువులందుఁ
గలుగువక్రతలను గాంచి చెలువలార!
నవ్వఁదగ దించుకయు నట్టినరులఁ బిలిచి
చేత నైనచో సాయంబు చేయ వలయు. 87.

తే.గీ. నిత్య మరుణోదయంబున నిద్ర లేచి
దంతధావన మొనరించి తగినరీతిఁ
బ్రాఁచిపనులను దీణిచి ప్రతిదినంబు
నిల్లు శుచిగాఁగ నుంచంగఁ జెల్లు సతికి. 88.

తే.గీ. ఒరులసంపదఁ గనుఁగొని యోర్వలేమి
దుర్గుణంబులలో నెల్ల దుర్గుణంబు;
సుదతి యెప్పుడు నట్టి యసూయ విడచి
పుడమి సరివారు మెచ్చంగ నడువ వలయు. 89.

తే.గీ. ఇతరు లొనరించుమేలును నించు కేని
మగువ లెప్పుడుఁ గలనైన మఱవ రాదు;
కొంచె మైనను గొప్పగా నెంచికొనుచుఁ
జేత నౌ మేలు క్రమ్మఱఁ జేయ వలయు. 90.

తే.గీ. ఇంటఁ గల గుట్లు పరులకు నించు కేనిఁ
దెలియ నీఁగూడ దెటు లైనఁ దెలిసె నేనిఁ,
గార్యముల కెల్ల భంగంబు కలుగుఁ గాన;
మెలఁత కడు మెలంకువ గల్గి మెలఁగ వలయు. 91.

తే.గీ. వీరికడమాటఁ గొనిపోయి వారికడను,
వారికడ మాటలను దెచ్చి వీరికడను,