పుట:Stree Neetideepika.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.వె. అడఁగి మడఁగి యుండునతివల నందఱు
ఘనముగాను జూతు రనవరతము;
విఱ్ఱవీఁగు చుండువెలఁదుల నెల్లరుఁ
జులుక గాను జూతు రిలను నెపుడు. 75.

తే.గీ. కలిమి తన కెంత గలిగిన గర్వపడక
బీదసాదల నరయుచు వినయ మొప్ప
నొరులహృదయంబునకు బాధ యొుదవ కుండ
మెలఁగుచుండెడి మెలఁతయె మెలఁత యెందు. 76. 
                                   చాడి

తే.గీ. కొండెములు చెప్పుకంటెను గ్రూర మైన
కార్య మొక్కటి యెందును గాన రాదు;
కాన, లేనివి కల్పించి చానలార!
యొకరిపయిఁ జెప్పఁ బోకుఁడీ యొరులతోడ. 77.

తే.గీ. వెలఁదిరో! నీవు విన లేదె 'విన్నమాట
కన్నఁ జెప్పెడుమాట చే' టన్నమాట;
కనుకఁ జెవి యిచ్చి చాడిని వినకు మమ్మ;
వింటివేని, యనర్థంబు లంటుఁజుమ్ము. 78.
                             పరోపకారము

తే.గీ. ఒక పరోపకారంబు చేయుటయె కాదె
యిలపయిని జన్మమెత్తినఫలము మనకుఁ;
గాన మనమేలు చూడకయైనఁ దరుణి;
పరుల కుపకార మొనరింప వలయుఁజూవె. 79.

తే.గీ. మహిని మనమెల్ల మనుజసామాన్యముగను
జాన!దైవ కుటుంబములోని వార
మగుట, లేమిచే, నొక్కఁడు పోగులు చుండ
సాయ మొనరింప కుండుట చనునె చెపును. 80.