పుట:Stree Neetideepika.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.గీ. మేఁక మొదలుగాఁ గల సాధుమృగములకును
బాధ సేయుదు రూరక పాడుసతులు;
తమ్ము మించెడు వారట్లు తమ్ముఁ గొట్ట
నెట్టు లుండునొ యొక్కింత యొఱుఁగ వలదె? 52.

తే.గీ. చిన్నజంతువులకు బాధ సేయుచున్న,
నంత కంతకు నదె హృదయంబునకును
బట్టు వడి, కొన్నినాళ్ళ లోపలనె నిజము
మనుజులకుఁ బీడ గలిగింప మనసు పుట్టు. 53.

తే.గీ. ప్రాణికోటిపై దయ గల్గువారియందు
దైవమును జాల దయ గల్గి తనరుఁ గాన,
సామజంబున కైనను దోమ కైన
నిర్నిమిత్తంబుగా బాధ నెఱప రాదు. 54.
                              కోపము

తే.గీ. కోపమే పాపముల కెల్లఁ గుదు రటంచు
నెప్పుడును దొంటిపెద్దలు చెప్పు చుంద్రు;
దీని మదిలోన సతతంబు దృఢము చేసి
మానినులు కోప మనుమాట మఱవ వలయు. 55.

తే.గీ. కొలువు కుదిరినవారిపైఁ గోపపడక,
మంచితనముననే మీరు మగువలార!
పని గొనుం డందువలనను వారు కరము
భక్తియును శ్రద్ధ కాన్పింత్రు పనులయెడల. 56.

ఆ. వె. పనులఁ బనుచునపుడు పనివారలను విూరు
కసరు చుందు రేని కాంతలార!
పనిని జేయ రెపుడు బాగుగ; మఱి మీకుఁ
గ్రూరురాం డ్రటంచుఁ బేరు వచ్చు. 57.