పుట:Srivemanayogijiv00unknsher.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగము నవలంబించి యున్న లంబికాశివయోగిని దర్శించి సాష్టాంగముగా దండము నిడి చేతుల గట్టికొని నిలువబడెను. ఇంతకు ముందే వెనువెంటవచ్చుచున్న వేమన్నయును అభిరామయ్యకు గనుపడక యుండునట్టులు సమీపమునున్న చెట్టుచాటుననిలిచి యోగియొక్కయు నభిరామునియొక్కయు సంభాషణములను వినుచుండెను. ఇంతలో సమాధినుండి మఱలి యాలంబికాశివయోగిగారు, "నాయనా! శిష్యా! చాలకాలమునుండియును బత్తితో మాకు పరిచర్యలను సేయుచున్నావు మేమును నీయంతరంగమును మిక్కిలి జాగ్రత్తతో బరీక్షించితిమి, నీవిప్పుడుపదేశము నొందుటకు తగిన యోగ్యత నొందియున్నావు మాకునిచ్చటి నివాస కాలమును ముగియ వచ్చినయది కావున రేపటిదినము నీకుపదేశము నొసంగ దలచియుంటిని, ఎన్ని పనులున్నను ఱేపు తప్పక రావలయును సుమా?" యని పలికి మఱల ధ్యాన స్తిమితలోచను డయ్యెను.

అభిరామయ్యయును మఱల యోగికనులు దెఱచు నంతకునుండి సెలవుగైకొని కృతార్థుడనైతిని కదా యనిసంతసించుచు మఱలు లోపలనే వేమన్న యాతనికి తెలియకుండునట్లు త్వరగా వెనుకకుమఱలి దుకాణము జేరి కూర్చుండి యుండెను. అభిరామయ్యయును పిదప మెల్లగావచ్చెను. వేమన్నగారు మఱలయెప్పటి