పుట:Sringara-Malhana-Charitra.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇందునిచే నొడ లుడుకన్
గుందును వెలిలోన మాడుకొఱవుల చూఁడన్
యెందు సహింపదు దైవము
ముందఱ నుయి వెనుక బొంద మొగి ననుటయ్యెన్.


క.

ఈవేళ మత్ప్రియుండగు
జీవితపతి మోముఁ జూడఁ జేకుఱెనేనిన్
దైవంబు కరుణ నాపై
నేవిధమునఁ జాలఁ గల్గు టెఱుఁగఁగ వచ్చున్.


గీ.

చంద్రకాంతపుగిండి వాసనజలంబుఁ
గొనుచు వాకిటి కరుదెంచి కువలయాక్షి
వెడఁదకన్నులుఁ బెదవులుఁ దడుపుకొనుచు
నుమ్మలిక నొయ్యఁ బుక్కిలించుమియుటయును.


గీ.

దద్దరముచేత నాచులోఁ దమ్మివిరిని
నున్న యెలతేఁటిపైఁ దేనె యొలికినట్లు
మలహణునిమీఁదఁ బడియె నాజలకణములు
మదనసంతాపవహ్నికి మాటుదోఁప.


వ.

అప్పుడు మలహణుండు శివస్మరణంబు సేసి తనలో నిట్లనియె.