పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్వాపరాలు

తెలుగు నిఘంటువులలో విశిష్ట చరిత్ర కలిగినది; సుదీర్ఘకాలం నిర్మాణం జరిగినది శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు మాత్రమే. తీవ్ర విమర్శలకు లోనయ్యిందీ ఈ నిఘంటువే. పిఠాపురం చివరి జమీందారు మహాదాత, విద్వతోషకుడు, అత్యున్నత వ్యక్తిత్వం తన సొంతమైన మహారాజా శ్రీ రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్ వారి ఆర్థిక సహాయంతో వారి పేరిట వెలువడిన నిఘంటువు సూర్యరాయాంధ్ర నిఘంటువు. దాని పుట్టు పూర్వోత్తరాలు, ఆ నిఘంటువు నిర్మాణానికై అపరిమితమైన ధనాన్ని, కాలాన్ని, మేధస్సును వెచ్చబెట్టిన మహానుభావుల గురించి తప్పక తెలుసుకోవాలి.

సూర్యరాయాంధ్ర నిఘంటువుతో ఇద్దరి పేర్లు విడదీయలేని విధంగా ముడిపడ్డాయి. ఒకరు పిఠాపురం మహారాజా, రెండవవారు జయంతి రామయ్య పంతులు.

బ్రిటీష్ ప్రభుత్వం బ్రిటిష్ ఇండియాలో పూర్తిస్థాయిలో పరిపాలన చేపట్టిన తరువాత స్థానిక సంస్థానాధీశులందరూ పేరుకే రాజులయ్యారు. పూర్వకాలంలోలాగా యుద్ధాలు, రాజ్య విస్తరణ, పొరుగు రాజ్యాలపై ఒక కన్నువేసి వుంచటం, రాజనీతిని అభ్యసించడం లాంటి కార్యక్రమాలు అవసరం లేకపోయాయి. తన సంస్థానంలో ప్రజల వద్దనుండి పన్ను వసూలు చేసి, బ్రిటీష్ ప్రభుత్వం తన సంస్థానానికి విధించిన పేష్కష్ ను చెల్లించే ఉద్యోగిగా రాజు మారిపోయాడు. పేరుకి బ్రిటిష్ ప్రభుత్వం వారిని రాజాలని, మహారాజాలని గౌరవిస్తూవున్నా వాస్తవానికి వారు 'బిల్ కలెక్టర్' గానే పనిచేశారు. ఈ దశలో ఏర్పడిన 'వాక్యూమ్'లో ఏంచేయాలో తెలియక కామినీ లోలురైనవారు కొందరు; వేటవ్యసనంలో పడినవారు కొందరు; గుర్రపు పందాలలో చిక్కుకొన్నవారు కొందరు; వారసత్వపు తగాదాలలో, సంస్థానంలోని ప్రజల హక్కుల హరణోద్యోగంలో కోర్టు పక్షులయినవారు కొందరు; కుక్కలను పెంచి ఆడంబరంగా పెళ్లి పేరంటాలు చేసేవారు కొందరు; ఇలా మన సంస్థానాధీశులు, జమీందారులు రకరకాల కాలక్షేపాలు వెతుక్కొన్నారు. ఆంధ్రభాష అదృష్టం కొద్దీ సూర్యారావు గారు మాతృభాషాదేవి సేవలో తరించారు.

సూర్యారావుగారు బాల్యంలో కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. వీరు పుట్టకముందు తండ్రి గంగాధర రామారావుగారు వెంకటగిరి రాజవంశీకులలో ఒకరిని దత్తు తీసుకున్నారు. దత్తుడికి, ఔరసుడైన సూర్యారావుగారికి పిఠాపుర సంస్థానపత్యంలో తగాయిదా ఏర్పడింది. వివాదం న్యాయస్థానానికి చేరింది. ఈ సమయంలో సూర్యారావుగారు మద్రాసులో విద్యాభ్యాసానికి వెళ్లారు. అక్కడ తెలుగు

12