పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

నీ రామాయణము మిక్కిలి విశిష్టతగలది. ఇది దేశి సాహిత్యమున ప్రధానముగా విలసిల్లిన ద్విపద కవితా శాఖకుఁ జెందినది. దాక్షిణాత్య సాహిత్యములో తెనుగునకు గల ప్రత్యేకతను నిరూపించు రచనలలో ద్విపద యొకటి. పేరు సంస్కృతమైనను, సంస్కృతమున నీ రచన లేదు. ద్రవిడ కర్ణాట భాషలలో లేదు. కన్నడులకు త్రిపద, షట్పద, ప్రియమైన పదచ్ఛందస్సులు. తెనుఁగున నైహికాముష్మిక ద్విపద హేతువుగ నీద్విపదను దిద్ది తీర్చిన మహాకవి పాల్కురికి సోమనాథుఁడు. గేయరూప మగు జానపద వాఙ్మయమునుండి, యీ ఛందస్సు నుద్ధరించి, దీనికి మహాకావ్య ప్రతిపత్తి గడించి ద్విపద వాఙ్మయమునకు శ్రీ కారము చుట్టిన వాఁడు సోమనాథుఁడే ! ఆతఁడు రచించిన బసవపురాణ పండితారాధ్య చరిత్రములు ద్విపద వాఙ్మయములో ప్రాథమికములు. ఆ వెనుక రంగనాథ రామాయణము, ఉత్తర కాండమును వెలసినవి. మడికి సింగన భాగవత దశమస్కంధ ద్విపద, గౌరన ద్విపద రచనలు, పిడుపర్తి బసవన ద్విపద రచనలు శ్రీనాథ యుగమునాటివి. ఇందు చాలభాగము వీర శైవమునకుఁ జెందినవి. శ్రీ కృష్ణ దేవరాయ యుగముతో వైష్ణవ మతముతో ద్విపద వాఙ్మయమున ద్వితీయ ఘట్టము ప్రారంభమైనది. తాళ్లపాక చిన్నన్న,దోనూరి కోనేరు కవుల ద్విపద రచనలు ప్రకాశించిన కాలమిదియే. ఈ యుగమునకు వెనుక వెలసిన వైష్ణవ ప్రపత్తిగల ద్విపద కావ్యములలోను రామాయణ ద్విపదలలోను నొక ప్రత్యేక విశిష్టత గడించిన దీ వరదరాజు రామాయణము.