పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

127

సీ. వలనొప్పఁగా "నదైవం కేశవా త్పరం" బని పల్కు రాజ కీరావళియును

మహిమ "సర్వం విష్ణుమయము జగత్త"ని చదివెడు శారికా సముదయంబు

నేపారఁగా "జితం తే పుండరీకాక్ష!" యని లీలఁ బాడు పికావళియును

లలి మీఱఁగా "మంగళం మధుసూదన" యని పల్కు కేకు లనారతంబు


తే. తవిలి శ్రౌషడ్వష ట్స్వధేత్యాది శబ్ద, కలితముగ మ్రోయు మధుప నికాయములను

గలిగి యఖిలైక దివ్యమంగళ విలాస, మహిమఁ జెన్నొందు వైకుంఠమందిరంబు. (228)


వ. మఱియుం బయోధరావళీ విభాసిత నభంబుం బోలె వెలుంగుచున్న య ద్దివ్య ధామంబునందు. (229)


సీ. సలలి తేందీవర శ్యామాయమాణోజ్జ్వలాంగులు నవ్య పీతాంబరులును

ధవ ళారవింద సుందర పత్రనేత్రులు సుకుమార తనులు భాసుర వినూత్న

రత్న విభూషణ గైవేయ కంకణహార కేయూర మంజీర ధరులు

నిత్య యౌవనులు వినిర్మల చరితులు రోచిష్ణులును హరిరూప ధరులు


తే. నగు సునందుండు నందుండు నర్హణుండు, ప్రబలుఁడును మొదలగు నిజపార్శ్వచరులు

మఱియు వైడూర్యవిద్రుమామలమృణాళ తుల్యగాత్రులుఁదను భక్తితోభజింప. (230)


సీ. క్షాళి తాఖిల కల్మషవ్ర జామరనదీజనక కోమల పదాబ్జములవాని

నఖిల సంప త్కారుణాపాంగ లక్ష్మీ విలాసిత వక్షస్ధ్సలంబు వానిఁ

బద్మమిత్రామిత్ర భాసిత కరుణా తరంగిత చారు నేత్రములవాని

భువన నిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ కారణ నాభి పంకజము వాని


తే. నహిహితాహిత శయన వాహములవాని, సేవి తామర తాపస శ్రేణివాని

నఖిల లోకంబులకు గురుండైన వానిఁ గాంచెఁ బరమేష్ఠి కన్నుల కఱవు దీఱ. (231)


క. కమనీయ రూప రేఖా, రమణీయతఁ జాల నొప్పు రమణీమణి య

క్కమలాలయ దన మృదు కర, కమలంబుల విభుని పాదకమలము లొత్తన్. (232)