128
వ. వెండియు. (233)
శా. శ్రీ కాంతాతిలకంబు రత్న రుచి రాజి ప్రేంఖిత స్వర్ణ డో
లాకేళిన్ విలసిల్లిత త్కచ భరాలం కార స్రగ్గంధ లో
భాకీర్ణ ప్రచర న్మధువ్రత మనో జ్ఞాలోల నాదంబు ల
స్తోకానుస్వర లీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్. (234)
వ. అట్టి నిత్యవిభూతియందు. (235)
మ. సతత జ్ఞాన రమా యశో బల మహైశ్వర్యాది యుక్తుం జగ
త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళ త్పంకేరుహాక్షుం శ్రియః
పతి నాద్యంత వికార దూరుఁ గరుణా పాథోనిధిన్ సాత్త్వతాం
పతి వర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణునిన్. (236)
మ. దరహా సామృత పూరితాస్యు నిజభక్త త్రాణ పారాయణు
న్న రుణాంభోరుహ పత్ర లోచనునిఁ బీతావాసుఁ ద్రైలోక్యసుం
దరు మంజీర కిరీట కుండల ముఖోద్య ద్భూషు యోగీశ్వరే
శ్వరు లక్ష్మీయుత వక్షుఁ జిన్మయు దయాసాంద్రున్ చతుర్బాహునిన్. (237)
వ. మఱియు (ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండు సునంద నంద కుముదాది సేవితుండు) ప్రకృతి పురుష మహా దహంకారంబులను చతుశ్శక్తులును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో మహాభూతంబులను షోడశ శక్తులును, పంచన్మాత్రలును, పరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయండును, (స్వ స్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండు నైన) పరమపురుషుం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానంద కందళిత హృదయారవిందుండు, రోమాంచ కంచుకిత శరీరుండు, నానంద బాష్పధారాసిక్త కపోలుండు నగుచు. (238)
క. వర పరమహంస గమ్య, స్ఫురణం దనరారు పరమ పురుషుని పద పం
కరుహములకు నజుఁడు చతు, శ్శిరముల సోఁకంగ నతులు సేసిన హరియున్. (239)