Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

బ్రహ్మ తపంబునకు మెచ్చి శ్రీమన్నారాయణుఁడు వరంబిచ్చుట

సీ. హరి పాదభక్తి రహస్యోపదేష్టయు నఖిల దేవతలకు నదివిభుండు

నైన విధాత గల్పాదియుందును నిజాశ్రయ పద్మమున కధిష్టాన మర య

నర్థించి జలముల నన్వేషణము సేసి నళినంబు మొదలు గానంగలేక

విసివి క్రమ్మఱను ద ద్బిసరుహాసీనుఁడై సృష్టి నిర్మాణేచ్ఛఁ జిత్తమందుఁ


తే. జాల నూహించి తత్పరిజ్ఞాన మహిమ, సరణి మనమునఁ దోఁపక జడను పడుచు

లోకజాలంబు పుట్టింపలేక మోహి, తాత్ముఁడై చింతనొందు న య్యవసరమున. (225)


వ. జలమధ్యంబుననుండి యక్షర సమామ్నా యంబున స్పర్శంబులందు షోడశాక్షరంబు మఱియు నేక వింశాక్షరంబు నైన నీ యక్షర ద్వయంబు వలన నగుచు, మహాముని జన ధనంబైన తప యను

శబ్దంబు రెండు మాఱు లుచ్చరింపంబడి వినంబడిన,నట్టి శబ్దంబు వలికిన పురుషుని వీక్షింపం గోరి నలుదిక్కులకుం జని వెదకి యెందునుం గానక మరలి నిజస్ఠానం బైన పద్మంబునం దాసీనుండై

యొక్కించుక చింతించి యట్టి శబ్దంబు దన్నుఁ దపంబు సేయుమని నియమించుటగాఁ దలఁచి, ప్రాణాయామ పరాయణుండై, జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి యేకాగ్ర చిత్తుండె, సకలలోక

సంతాప హేతువైన తపంబు వేయి దివ్యవత్సరంబులు గావింప, నీశ్వరుండు ప్రసన్నుండై పొడచూపిన, నా కమలసంభవుండు దత్క్షణంబు రాజస, తామస మిశ్ర సత్త్వగుణాతీతంబును, శుద్ధ

సత్త్వగుణావాసంబును, అకాల విక్రమంబును, సర్వలోకోన్నతంబును, సకల సురగణ స్తుత్యంబును, లోభ మోహ భయవిరహితంబును, అపునరావృత్తి మార్గంబును, అనంత తేజో విరాజితంబును నైన

వైకుంఠపురంబుఁ బొడగని యందు. (226)


సీ. సూర్య చంద్రానల స్ఫురణలఁ జొరనీక నిజ దీధితి స్ఫూర్తి నివ్వటిల్ల

దివ్య మణిప్రభా దీపిత సౌధ విమాన గూపుర హర్మ్య మండపములు

ప్రసవ గుచ్ఛ స్వచ్ఛ భరిత కామిత ఫలసంతాన పాదప సముదయములు

కాంచన దండ సంగత మారు తోద్ధూత తరళ విచిత్ర కేతన చయములు

తే. వికచ కైరవ దర దరవింద గత మ, రందరస పాన మోది తేందిందిర ప్రభూత

మంజుల ని సద ప్రబుద్ధ రాజ, హంస శోభిత వర కమలాకరములు. (227)