పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

సీ. సాంద్ర శరచ్చంద్ర చంద్రికా ధవళిత విమల బృందావన వీథియందు

రాసకేళీ మహోల్లాసుఁడై యుత్ఫుల్ల జలజాక్షుఁ డొక నిశాసమయమునను

దనరారు మంద్ర మధ్యమ తారముల నింపు దళుకొత్త రాగ భేదములఁ దనరి

ధైవత ఋషభ గాంధార నిషాద పంచమ షడ్జ మధ్యమస్వరము లోలిఁ


తే. గళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణు, నాళ వివరాంగుళీ న్యాస లాలనమున

మహితగతిఁ బాడె నవ్యక్త మధురముగను, బంక జాక్షుండు దారువు లంకురింప. ( 188 )


మ. హరి వంశోద్గత మంజుల స్వర నినా దాహూతలై గోపసుం

దరు లేతేర ధనాధిపానుచర గంధర్వుండు గొంపోవఁ ద

త్తరుణుల్ గుయ్యిడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తాఁ

బరిరక్షించిన యట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే యేరికిన్. ( 189 )


చ. నరక ముర ప్రలంబ యవన ద్విప ముష్టిక మల్ల కంస శం

బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్తృ వా

నర ఖర సాల్వ వత్స బక నాగ విడూరథ రుక్మి కేశి ద

ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్. ( 190 )


వ. మఱియును, ( 191 )


మ. బల భీమార్జున ముఖ్య చాపధర రూప వ్యాజతం గ్రూరులన్

ఖలులన్ దుష్ట ధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దో

ర్బల కేళీం దునుమాడి సర్వధరణీ భారంబు మాయించి సా

ధుల రక్షించిన యట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్. ( 192 )


వ. అట్టి లోకోత్కష్డుం డైన కృష్ణుని యవతార మహాత్మ్యం బెఱింగించితి. ఇంక వ్యాసావతారంబు వినుము. ( 193 )


ఉ. ప్రత్యుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదౌ

ర్గత్యగులైన మర్త్యుల కగమ్యములై స్వకృతంబు నిత్యముల్

సత్యము నైన వేద తరుశాఖల దా విభజించి నట్టి యా

సాత్యవతేయ మూర్తియయిజాతము నొందె హరి ప్రసన్నుఁడై. ( 194 )


వ. మఱియు బుద్ధావతారంబు వినుము. ( 195 )