పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

119

మ. అతిలోలాత్ము ల సూనృతోక్తులును వేదాచార సంశీలు రు

ద్థత పాషాండ మతౌపధర్మ్యులు జగత్సంహారు లైనట్టి యా

దితి సంజాతు లధర్మవాసనల వర్తింపం దదాచార సం

హతి మాయించి హరించె దానవులఁ బద్మాక్షుండు బుద్దాకృతిన్ ( 196 )


వ. మఱియుం గల్క్యవతారంబు వినుము. ( 197 )


మ. వనజాక్ష స్తవ శూన్యులున్ వషడితి స్వాహాస్వధా వాక్య శో

భన రాహిత్యులు సూనృ తేతరులునుం బాషండులు న్నైన వి

ప్రనికాయంబును శూద్ర భూవిభులున్ బాటిల్లినన్ గల్కియై

జననం బంది యధర్మము న్నడఁచి సంస్థాపించు ధర్మం బిలన్. ( 198 )

వ. అని మఱియుఁ బితామహుండు నారదున కిట్లనియె. మునీంద్ర! పుండరీకాక్షుండంగీకరించు లీలావతార కథావృత్తాంతంబులు నే నీకు నెఱింగించు నింతకు మున్న హరి వరాహాద్యవతారంబు లంగీకరించి తత్ప్రయోజనంబులు దీర్చె. మన్వంతరావతారంబులు నంగీకరించినవియు, నంగీకరింపం గలయవియునై యున్నవి. వర్తమానంబున ధన్వంతరి పరుశరామావతారంబులు దాల్చి యున్నవాఁడు. భావికాలంబున శ్రీరామా ద్యవతారంబుల నంగీకరింపం గలవాఁడు. అ మ్మహాత్ముండు సృష్ట్యాది కార్య భేదంబుల కొఱకు మాయా గుణావతారంబు నొందు. బహుశక్తి ధారణుండైన భగవంతుడు సర్గంబునం దపంబును, ఏనును, ఋషి గణంబులును, నవప్రజాపతులును నై యవతరించి విశ్వోత్పాదనంబు గావించు. ధర్మంబును , విష్ణుడును, యజ్ఞంబులును, మనువులును, ఇంద్రాది దేవగణంబును ధాత్రీపతులునై యవతరించి జగంబుల రక్షింపుచుండు. అధర్మంబును రుద్రుండును, మహోరగంబులును, రాక్షాసానీకంబులు నై విలయంబు నొందించు. ఇత్తెఱంగునం బరమేశ్వరుండును, సర్వాత్మకుండు నైన హరి విశ్వోత్పత్తిస్థితిలయ హేతుభూతుండై విలసిల్లు. ధరణీరేణువులైన గణుతింప నలవియగుం గాని యమ్మహాత్ముని లీలావతారాద్భుత కర్మంబులు లెక్క వెట్ట నెవ్వనికి నశక్యంబై యుండు. నీకు సంక్షేపరూపంబున నుపన్యసించితి. సవిస్తరంబుగా నెఱింగింప నాకుం దరంబు గాదు. అన్యులం జెప్పనేల? వినుము. 199