117
క. మందుని గతి యమునాంబువు, లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా
నందుని వరుణుని బంధన, మందు నివృత్తునిఁగఁ జేసె హరి సదయుండై. ( 181 )
మ. మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృ ద్గుహ
శ్రయులంగా నొనరించి తత్ఫథము నీరంధ్రంబు గావించినన్
రయ మొప్పన్ గుటిలాసురాధమునిఁ బోరన్ ద్రుంచి గోపావళిన్
దయతోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేత న్మాత్రమే? తాపసా! ( 182 )
క. దివిజేంద్ర ప్రీతిగ వ, ల్లవజను లేఁటేఁటఁ జేయు లాలిత సవనో
త్సవమున్ హరి మాన్చిన గో, పవరులు గావింపకున్నబలరిపుఁడలుకన్. ( 183 )
తే. మంద గొందలమంద నమందవృష్టి, గ్రందుకొనుఁడంచు నింద్రుండు మంద కంపె
జండ పవన సముద్ధూత చటులవిలయ, సమయ సంవర్తకాభీల జలధరములు. ( 184 )
శా. సప్తస్కంధ శిఖాకలాప రుచిమ త్సౌదామినీ వల్లికా
దీప్తదగ్ర ముహు ర్ముహుస్స్తనిత ధాత్రీభాగ నీరంధ్రమై
సప్తాశ్వస్ఫుర దిందుమండల నభ స్సంఛాది తాశాంతర
వ్యాప్తాంభోద నిరర్గళ స్ఫుట శిలా వా:పూర ధారాళమై. ( 185 )
వ. కురియు వానజల్లు పెల్లున రిమ్మలుగొని సొమ్మలువోయి గోప గోకులం బాకులంబు నొంది కృష్ణ! కృష్ణ! రక్షింపు; రక్షింపు మని యార్తిం బొందికుయ్యిడన య్యఖండ కరుణారస సముద్రుండు భక్తజన సురద్రుముండు నగు పుండరీ కాక్షుండు. ( 186 )
శా. సప్తాబ్దంబుల బాలుఁడై నిజ భుజా స్తంభంబునన్ లీలతో
సప్తాహంబులు శైల రాజ మచల చ్చత్రంబుగాఁదాల్చి సం
గుప్త ప్రాణులఁ జేసె మాధవుఁడు గో గోపాలక వ్రాతమున్
సప్తాంభోధి పరీత భూధరున కాశ్చర్యంబె! చింతింపఁగన్. ( 187 )