1 1 1
వ. అట్టి నరనారాయణావతారంబు జగత్ప్రావనంబై విలసిల్లె. వెండియు ధ్రువావ తారంబు వివరించెద వినుము. ( 135 )
సీ. మానిత చరితుఁ డుత్తానపాదుం డను భూవరేణ్యునకు సత్పుత్రుఁ డనఁగ
నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున జనకుని కడ నుండి సవతితల్లి
తను నాడు వాక్యాస్త్ర తతిఁ గుంది మహిత తపంబు గావించి కాయంబుతోడఁ
జని మింట ధ్రువపద స్థాయియై యట మీఁద నర్ధి వర్తించు బృగ్వాది మునులు
తే. చతురగతిఁ గ్రింద వర్తించు సప్తఋషులు, పెంపు దీపింపఁ దన్ను నుతింపుచుండ
ధ్రువుఁడునానొప్పి యవ్విష్ణుతుల్యుఁడగుచు, నున్నపుణ్యాత్ముఁడిప్పుడునున్న వాడు. ( 136 )
వ. పృథుని యవతారంబు వినుము. ( 137 )
ఉ. వేనుఁడు విప్రభాషణ పవి ప్రహర చ్యుత భాగ్య పౌరుషుం
డై నిరయంబునం బడిన నాత్మతనూభవుఁడై పృథుండు నా
బూని జనించి త జ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్
ధేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై. ( 138 )
వ. అని మఱియు వృషభావతఅరంబు నెఱిఁగింతు వినుము. ఆగ్నీధ్రుండను వానికి సుదేవివలన నాభి యను వాఁ డుదయించె. అతనికి మేరుదేవియందు హరి వృష భావతారంబు నొంది, జడస్వభావం బైన యోగంబు దాల్చి ప్రశాంతాంత: కరణుండును విముక్త సంగుండునై, పరమ హంసాభిగమ్యంబైన పదం బిది యని మహర్షులు పలుకుచుండం జరించె, మఱియు హయగ్రీవావతారంబు సెప్పెద వినుము. ( 139 )
చ. అనఘచరిత్ర! మ న్మఖమునందు జనించె హయాన నాఖ్యతన్
వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డభి లాంతరాత్మకుం
డనుపమ యజ్ఞపూరుషుఁడు నై భగవంతుడు ద త్సమస్త పా
వనమగు నాసికా శ్వసన వర్గములం దుదయించె వేదముల్. ( 140 )
వ. మరియు మత్స్యావతారంబు వినుము. ( 141 )