పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

వస్తుసారంబులకు వర్ణనీయ సౌభాగ్యంబులకుం బరమపురుషుని గాత్రంబు భాజనంబు. స్పర్శంబునకు వాయువునకు సకల స్నిగ్ధంబులకు దివ్యదేహుని దేహేంద్రియంబు గేహంబు, యూప ప్రముఖ యజ్ఞోపకరణ సాధనంబులగు తరుగుల్మ లతాందులకుఁ బురుషోత్తముని రోమంబులు మూలంబులు. శిలా లోహంబులు సర్వమయుని నఖంబులు, మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు. మెఱుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు, భూర్భువ స్సువర్లోక రక్షకులైన లోక పాలకుల పరాక్రమంబులకు, భూరాది లోకంబుల క్షేమంబునకు, శరనంబునకు, నారాయణుని విక్రంబులు నికేతనంబులు. సర్వకామంబులకు నుత్తమంబు లైన వరంబులకుఁ దీర్ధపాదుని పాదారవిందంబు లాస్పదంబులు. జలంబులకు, శుక్లంబునకు, పర్జన్యునకు, ప్రజాపతి సర్గంబునకు, సర్వేశ్వరుని మేడ్రంబు సంభవ నిలయంబు. సంతానంబునకుఁ గామాది పురుపార్థంబులకుఁ జిత్త సౌఖ్యరూపంబులకు నానందంబులకు, శరీర సౌఖ్యంబునకు నచ్యుతుని యుపస్థేంద్రియంబు స్థానంబు, యమునికి, మిత్రునికి, మలవిసర్గంబునకు భగవంతుని పాయ్మింద్రియంబు భువనంబు, హింసకు నిరృతికి మృత్యువునకు నిరయంబునకు నిఖిలరూపకుని గుదంబు నివాసంబు. పరాభవంబునకు నధర్మంబునకు నవిద్యకు ననంతుని పృష్ట భాగంబు సదనంబు. నద నదీ నివహంబునకు నీశ్వరుని నాడీ సందేహంబు జన్మ మందిరంబు. పర్వతంబులకు నధోక్షజుని శల్యంబులు జనక స్థలంబులు. ప్రధానంబునకు నన్నరసంబులకు సముద్రంబులకు భూవలయంబునకు బ్రహ్మాండ గర్భుని యుదరంబు నివేశంబు. మనోవ్యాపార రూపంబగు లింగ శరీరంబునకు మహా మహిముని హృదయంబు సర్గభూమి యగు. మఱియు. ( 89 )

ఆ. నీలకంధరునకు నీకు నాకు సనత్కు, మార ముఖ్య సుత-సమాజమునకు

ధర్మ సత్త్వ బుద్ధి తత్త్వములను నీశ్వ, రాత్మ వినుము పరమమైన నెలవు. ( 90 )


సీ. నర సురాసుర పితృ నాగ కుంజర మృగ గంధర్వ యక్ష రాక్షస మహీజ

సిద్ధ విద్యాధర జీమూత చారణ గ్రహ తార కాప్సరోగణ విహంగ

భూత తటి ద్వసు పుంజంబులను నీవు మూక్కంటియును మహామునులు నేను

సలిల నభస్స్థల చరములు మొదలైన వివిధ జీవులతోడ విశ్వమెల్ల

ఆ. విష్ణు మయము పుత్ర! వేయేల బ్రహ్మాండ, మతని జేనలోన నణఁగి యుండు

బుద్ధి నెఱుఁగరాదు భూత ద్భవ్య, లోకమెల్ల విష్ణులోన నుండు. ( 91 )