105
క. మండలములోన భాస్కరుఁ, డుండుచు జగములకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాండములోపల నచ్యుతుఁ, డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్. ( 92 )
ఉ. అట్టి అనంతశ క్తి జగదాత్ముని నాభి సరోజమందు నేఁ
బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞ పదార్ధ జాతముల్
నెట్టిన గానరామికిని నిర్మలమైన తదీయ రూపమున్
గట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నామనంబునన్. ( 93 )
సీ. పశు యజ్ఞవాట యూపస్తంభ పాత్ర మృద్ఘట శరావ వసంత కాలములను
స్నేహౌషధీ బహు ళోహ చాతుర్హోత్ర మత నామధేయ సన్మంత్రములును
సంకల్ప ఋగ్యజు స్సామ నియుక్త వషట్కార మంత్రాను చరణములును
దక్షిణల్ దేవతా ద్యనుగత తంత్ర వ్రతోద్దేశ ధరణీసురోత్త మాదు
తే. లర్పణంబులు బోధాయనాది కర్మ సరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి
యంతయును నమ్మహాత్ముని యవయవములు, గాఁగఁగల్పించి విధివత్ప్ర్ కారమునను. ( 94 )
క. యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు, యజ్ఞేశుఁడు యజ్ఞభోక్త యగు భగవంతున్
యజ్ఞపురుషుఁగా మానస, యజ్ఞముఁ గావించితిం ద దర్పణబుద్ధిన్. ( 95 )
క. అప్పుడు బ్రాహ్మణు లెల్లం, దప్పక ననుఁ చూచి సముచిత క్రియ లగుచో
న ప్పరమేశున కభిమత, మొప్పఁగఁ దగు సప్తతంతువును గావింపన్. ( 96 )
చ. మనువులు దేవదానవులు మానవనాథులు మర్త్యకోటి దా
రనయము వారివారికిఁ బ్రియంబగు దేవతలన్ భజింపుచున్
ఘనతరనిష్ఠ యజ్ఞములు గైకొని చేసిరి తత్ఫలంబు ల
య్యనుపమ మూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందఁగన్. ( 97 )
క. సువ్యక్త తంత్రరూపకుఁ, డవ్యక్తుఁ డనంతుఁ డభవుఁ డచ్యుతుఁ డీశుం
డవ్యయుఁడగు హరి సురగణ, సేవ్యుఁడు గ్రతుఫలదుఁడగుటఁ జేసిరి మఖముల్. ( 98 )
క. అగుణం డగు పరమేశుఁడు, జగములు గల్పించు కొఱకుఁ జతురత మాయా
సగుణుండగుఁ గావున హరి, భగవంతుం డనఁగఁ బరఁగె భవ్యచరిత్రా! ( 99 )