103
వ. వినుము చతుర్ధశ లోకంబులందు మీఁది యేడు లోకంబులు, శ్రీ మహావిష్ణువు నకుం గటిప్రదేశంబున నుండి యూర్ధ్వదేహ మనియును, గ్రింది యేడు లోకంబులు జఘనంబున నుండి యధోదేహ మనియునుం బలుకుదురు. ప్రపంచ శరీరకుండగు భగవంతుని ముఖంబు వలన బహ్మకులంబు, బాహువుల వలన క్షతృయ కులంబు, ఊరువుల వలన వైశ్యకులంబు, పాదంబు వలన శూద్ర కులంబు జనియించె నని చెప్పుదురు. భూలోకంబు గటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు శిరంబు, కటిప్రదేశం బతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు దలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదాతలంబు పాతాళంబు నని (లోకమయుంగా ) భావింతురు. కొందఱు మఱియుం బాదతలంబు వలన భూలోకంబును, నాభి వలన భువర్లోకంబును, మఱియుం బాదతలంబు వలన భూలోకంబును, నాభివలన భువర్లోకంబును, శిరంబు వలన స్వర్లోకంబును గలిగె నని లోక కల్పనంబు నెన్నుదురు.
అధ్యాయము - 6
పురుషోత్తముని ముఖంబు వలన సర్వజంతు వాచాజాలంబును దదధిష్టాత యగువహ్నియు నుదయించె. చర్మ రక్త మాంస మేదశ్శల్య మజ్జా శుక్లంబులు సప్తధాతువు లందురు. పక్షాంతరంబున రోమ త్వ జ్మాం సాస్థి స్నాయు మజ్జా ప్రాణంబులను సప్తధాతువు లని యందురు. అందు రోమంబు లుష్ణిక్ఛందం బనియు, త్వక్కు ధాత్రీ ఛందం బనియు, మాంసంబు త్రిష్టుప్చందం బనియు, స్నాయు వనుష్టుప్చందం బనియు, ఆస్థి జగతీఛందంబనియు, మజ్జ పంక్తిచ్చందంబనియు, ప్రాణంబులు బృహతీ చందం బనియు నాదేశింతురు. హవ్య కవ్యామృతాన్నంబులకు మధురాది షడ్రసంబులకు రసనేంద్రియంబునకు రసాధీశ్వరుండైన వరుణునికిని హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు. సర్వ ప్రాణాదులకు వాయువునకు విష్ణు నాసికా వివరంబు నివాసంబు, సమీప దూర వ్యాపిగంధంబులకు నోషధులకు నశ్వనీదేవతలకు భగవంతుని ఘ్రానేంద్రియంబు నివాసంబు, దేవలోక సత్య లోకంబులకుఁ దేజంబునకు సూర్యునికి సకలచక్షువులకు లోక లోచను చక్షురింద్రియంబు స్థానంబు, దిశలకు నాకాశంబునకు శ్రుతి భూతంబులైన యంశంబులకు శబ్దంబులకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మ స్థానంబు,