పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

వాయువు వలన రూప స్పర్శ శబ్దంబు లనియెడి గుణంబులు మూఁటి తోడఁ దేజంబు గలిగె. తేజంబు వలన రసరూప స్పర్శ శబ్దంబు లనియెడు నాలుగు గుణంబులతోడ జలంబు గలిగె. జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబు లనియెడి గుణంబు లయిదింటితోడం బృథివి కలిగె. వైకారికంబైన సాత్త్వికాహంకారంబు వలనఁ జంద్ర దైవతంబైన మనంబు గలిగె. మఱియు దిక్కులు, వాయువు, అర్కుండు, ప్రచేతస్సు, అశ్వినులు, వహ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుండుఁ ప్రజాపతియు ననియెడి దశ దేవతలు గలిగిరి. తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబు, వాయుదైవతంబైన త్వగింద్రియంబు, సూర్యదైవతంబైన నయనేంద్రియంబు, ప్రచేతోదైవతంబైన రసనేంద్రియంబు, అశ్వినీదైవతంబైన జ్ఞాణేంద్రియంబు, వహ్నిదైవతంబైన వాగింద్రియంబు, ఇంద్రదైవతంబైన హస్తేంద్రియంబు, ఉపేంద్రదైవతంబైన పాదేంద్రియంబు, మిత్రదైవతంబైన గుదేంద్రియము, ప్రజాపతిదైవతంబైన గుహ్యేంద్రియంబు, ననియెడి దశేంద్రియంబులను బోధజన కాంత:కరణైక భాగంబైన బుద్ధియుఁ, గ్రియాజన కాంత:కరణంబైన ప్రాణంబును గలిగె. ఇట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతోఁ గూడిన భూతేంద్రియ మనోగుణంబులు వేర్వేఱుగ ( బ్రహ్మాండ శరీర నిర్మాణంబునం దసమర్ధంబులగు నపుడు భగవచ్ఛక్తి ప్రేరితంబులగుచు నేకీభవించి సమిష్టి వ్యష్ట్యాత్మ కత్వంబు నంగీకరించి) చేతనా చేతనంబుల గల్పించె. అట్టి యడంబు వర్షాయుత సహస్రాతంబు దనుక జలంబునం దుండె. ( కాల కర్మ స్వభావంబులం దగులు వడక సమస్తమును జీవయుక్తముగఁజేయు నీశ్వరుండ చేతనంబున సచేతనంబుగ నొనర్చె.) అంతఁ గాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్య స్థితంబైన బ్రహ్మాండంబులోను బొచ్చి సవిస్తరంబు గావించి ( యట్టి యండంబు భేదించి నిర్గమించె . ఎట్లుంటేని.) ( 86 )


క. భువనాత్మకుఁ డా యీశుఁడు, భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్

వివరముతోఁ బదునాలుగు, వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్. ( 87 )


మ. బహు పా దోరు భుజాస నేక్షణ శిర: ఫాల శ్రవో యుక్తుఁడై

విహరించున్ బహుదేహి దేహగతుఁడై విద్వాంసు లూహించి త

ద్బహురూ పావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతు రా

మహనీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ! ( 88 )