79
క. పొడిచినఁ దిట్టినఁ గిట్టినఁ బడుచుందురు గాని పరమ భాగవతులు దా
రొడఁబడరు మాఱు సేయఁగఁ గొడుకా ! విభుఁ డెగ్గుసేయఁ గోరఁడు నీకున్ . (483)
క. చలఁగరు కలఁగరు సాధులు, మిశితములై పరులవలన మేలుం గీడున్
నె;అకొనిననైన నాత్మకు, నొలయవు సుఖ దుఃఖ చయము లుగ్రము లగుచున్.(484)
వ. అని యిట్లు శమీక మహామునీంద్రుండు కొడుకు సేసిన పాపంబునకు సంతాపంబు నొందుచుండె. (485)
అధ్యాయము - 19
వ. అంత* (శమీక ప్రేషితుం డగు శిష్యుని వలన ) నా మునికుమారకు శాపంబు విని యా యభిమన్యు పుత్రుండు ( కామ క్రోధాది విషయాసక్తుఁడగు ) తనకు ( తక్షక విషాగ్ని ) విర క్తిబీజం బగు ననుచుఁ గరినగరంబునకుం జని యేకాంతంబున. (486)
ఉ. ఏటికి వేఁటఁ బోయితి ? మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా
నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి ? నే
డేటికిఁ బాపసాహసము లీక్రియఁ జేసితి ? దైవయోగమున్
దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై. (487)
ఉ. పాము విషాగ్ని కీలలను లేఁగిన నేఁగుఁ గాక యీ
భూమియు రాజ్యమున్ సతులు లోగముఁ బోయినఁ బోపుఁ గాక సౌ
దామినిఁ బోలు జీవనముఁ తథ్యముఁ దలపోసి యింక నే
నేమని మాఱు దిట్టుదు ? మునీంద్రకుమారకు దుర్నివారకున్ . (488)
ఆ. రాజు ననుచుఁ బోయి రాజ్యగర్వంబున, వనము కొఱకు వారి వనము సొచ్చి
దందశూక శవముఁ దండ్రిపై వైచినఁ, బొలియఁ దిట్ట కేల పోవు ? సుతుఁడు. (489)
క. గోవులకున్ బ్రాహ్మణులకు, దేవతలకు నెల్లప్రొద్దుఁ దెంపునఁ గీడుం
గావించు పాప మానస, మే విధమునఁ, బుట్టకుండ నే వారింతున్. (490)
వ. అని వితర్కించె. (491)