80
క. దామోదర పదభక్తిం, గామాదుల గెల్చినాఁడు గావునఁ గరుణన్
భూమీశుఁ డలుగఁ డయ్యెను, సామర్థ్యము గలిగి దోషసంగిన్ శృంగిన్ (492)
వ. అంత మునికుమారుండు శపించిన వృత్తాంత మంతయు నిట్లు వితర్కించి, తక్షక వ్యాళ విషానల జ్వాలా జాలంబునం దనక సప్తమ దినంబున మరణం బమి యెఱింగి, భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబు లని తలంచి, రాజ్యంబు విసర్జించి, నిరశన దీక్షాకరణంబు సంకల్పించికొని. (493)
మ. తులసీ సంయుత దైత్యజి త్పదరజ స్త్సోమంబు సంటెన్ మహో
జ్జ్వలమై దిక్పతిసంఘ సంయుత జన త్సౌభాగ్య సంధాయియై
కలిదోషావళి నెల్లఁ బాపు దివిష ద్గంగా ప్రవాహంబు లో
పలికిం బోయి మరిష్యమాణుఁ డగుచుం బ్రాయోపవేశంబునన్ . (494)
క. చిత్తము గోవింద పదా, యత్తముఁ గావించి మౌనియై తనలో నే
తత్తఱము లేక భావర, సత్తముఁడు వసించె ముక్త సంగత్వమునన్ . (495)
వ. ఇట్లు పాండవ పౌత్రుండు ముకుంద చరణారవింద వందనానంద సందాయమాన మానసుండై విష్ణుపదీ తీరంబునం బ్రాయోపవేశంబున నుండుట విని ( సకలలోక పావన మూర్తులు మహానుభావిలు నగుచుఁ దీర్థంబునకుం దీర్థత్వంబు లొసంగ సమర్థులై యత్రి, విశ్వామిత్ర , భృగు , వసిష్ఠ , పరాశర , (వ్యాస) భరద్వాజ , పరశురామ , దేవల , గౌతమ , మైత్రేయ , కణ్వ , కలశసంభవ , నారద , పర్వతాదు లైన బ్రహ్మర్షి , దేవర్షి , రాజర్షి , పుంగవులు , కాండఋషులైన యరుణాదులు, మఱియు నానాగోత్ర సంజాతులైన ఋషులును * ( శిష్య ప్రశిష్యసమేతులై ) యేతెంచిన వారలకు దండ ప్రణామంముల సేసి కూర్చుండ నియోగించి . (496)
క. క్రమ్మఱ నమ్మునివరులకు, నమ్మనుజేంద్రుండు మ్రొక్కి హర్షాశ్రుతతుల్
గ్రమ్మఁగ ముకుళితకరుఁడై, సమ్మతముగఁ జెప్పె నాత్మ సంచారంబున్ . (497)
ఉ. ఓపిక లేక చచ్చిన మహోరగముం గొనివచ్చి కోపినై
తాపసు మూఁపుపై నిడిన దారుణచిత్తుఁడ మత్తుఁడన్ మహా
పాపుఁడ మీరు పాపతృణ పావకు లుత్తము లయ్యలార ! నా
పాపము వాయు మార్గముఁ గృపాపరులార ! విధించి 1చెప్పరే ! (498)