Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

బ్రహ్మస్థావర పర్యంతంబు తిరుగుచున్న జనులకు నెయ్యది పొందరా దట్టి మేలు సిద్ధించు (కొఱకు) హరిసేవ సేయవలయు. హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం జిక్కఁడు. క్రమ్మఱ హరిచరణ స్మరణంబుఁ జేయుచు భక్తిరస వశీకృతుండై విడువ నిచ్చగింపఁడు. మఱియును, (1-99)


సీ. విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను, వేఱేమియును లేదు విశ్వమునకు

భవవృద్ధి లయములా పరమేశుచే నగు, నీ వెఱుంగుదు కాదె నీ ముఖమున

నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ, భువన భద్రమునకై పుట్టినట్టి

హరికళాజాతుండ వని విచారింపుము, కావున హరిపరాక్రమము లెల్ల

ఆ.వె. వినుతి సేయుమీవు వినికియుఁ జదువును, దాన మతుల నయముఁ దపము ధృతియుఁ

గలిమి కెల్ల ఫలము కాదె పుణ్యశ్లోకుఁ , గమలనాభుఁ బొగడఁ గలిగెనేని. (1-100)

నారదుని పూర్వజన్మవృత్తాంతము

వ. మహాత్మా ! నేను పూర్వకల్పంబునం దొల్లిఁటి జన్మంబున వేదవాదుల యింటి దాసికిం బుట్టి పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి యొక వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థల నివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు, (1-101)


కం. ఓటమితో నెల్లప్పుడుఁ , బాటవమునఁ బనులు సేసి బాలురతో నే

యాటలకుఁ బోక నొక జం,జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా ! (1-102)


కం. మంగళమనుచును వారల, యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్

ముంగల నిలతును నియతిని, వెంగలి క్రియఁ జనుదు నే వివేకము తోడన్. (1-103)


వ. ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితిని. వారును నా యందుఁ గృప సేసిరంత. (1-104)


శా. వారల్ కృష్ణచరిత్రముల్ చదువఁగా వర్ణింపఁగాఁ బాడఁగా

నా రావంబు సుధాప్రతిమమై యశ్రాంతమున్ వీనులం

దోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటన్

బ్రారంభించితి విష్ణుసేవ కితర ప్రారంభదూరుండనై. (1-105)