Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

మ. అపశబ్దంబులఁ గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పా

ప పరిత్యాగము సేయుఁ గావున హరిన్ భావించుచున్ బాడుచున్

జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబుఁ గీర్తించుచున్

దపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్త్వజ్ఞ ! చింతింపుమా ! (1-95)


వ. మునీంద్రా ! నిర్గత కర్మంబైన నిరుపాధికంబైన జ్ఞానంబు గలిగినను హరిభక్తి లేకున్న శోభితంబు గాదు. కర్మ మీశ్వరునకు సమర్పణంబు సేయకున్న నది ప్రశస్తంబై యుండదు. భక్తిహీనంబులైన జ్ఞానవాచా కర్మకౌశలంబులు నిరర్థంబులు. కావున మహానుభావుండవు, యథార్థ దర్శనుండవు. సకల దిగంత ధవళ కీర్తివి. సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబు కొఱకు వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము. హరివర్ణనంబు సేయక ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూప నామంబులం జేసి పృథగ్దర్శనుండైనవాని మతి పెనుగాలి త్రిప్పునం బడి తప్పంజను నావ చందంబున నెలవు సేరనేఱదు. కామ్యకర్మంబులందు రాగంబు గల ప్రాకృత జనులకు నియమించిన ధర్మంబులు సెప్పి శాసకుండవగు నీవు వగచుట తగదు. అది యెట్లనిన, వార లదియే ధర్మంబని కామ్యకర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు. అది గావున తత్వజ్ఞుండవై వ్యథావియోగంబు సేయుమని మఱియు నిట్లనియె. (1-96)


చం. ఎఱిఁగెడు వాఁడు కర్మచయమెల్లను మాని హరిస్వరూపమున్

నెఱయ నెఱింగి యవ్వలన నేఱుపు సూపు గుణానురక్తుఁడై

తెఱకువ లేక క్రుమ్మరుచు దేహ ధనాద్యభిలాష యుక్తుఁడై

యెఱుఁగని వానికి దెలియ నీశ్వరు లీల లెఱుంగఁ జెప్పవే. (1-97)


చం. తన కుల ధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్

పనివడి సేవ సేసి పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జ

చ్చిన మఱుమేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా

సినఁ గులధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్. (1-98)


వ. అది గావున నెఱుక గలవాఁడు హరిసేవకు యత్నంబు సేయందగు. కాలక్రమంబున సుఖ దు:ఖంబులు ప్రాప్తంబులైనను హరిసేవ విడువం దగదు. దానం జేసి