13
మోక్షమిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు. వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవపరంబులు. నిర్గుణుండైన పరమేశ్వరుండు కలుగుచు లేకుండుచు గుణంబుల తోడం గూడిన తన మయ చేత నింతయు సృజియించి, గుణవంతుని చందంబున నిజ మాయా విలసింతంబులైన గుణంబులలోఁ బ్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు. అగ్ని యొక్కరుండయ్యుఁ బెక్కు మ్రాఁకులందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుండొక్కఁడు తన వలనం గలిగిన నిఖిల భూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు. మనోభూత సూక్ష్మేంద్రియంబుల తోడం గూడి గుణమయంబులైన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందుఁ దగులువడక తద్గుణంబు లనుభవంబు సేయుచు లోకకర్తయైన యతండు దేవ తిర్యఙ్ మనుష్యాది జాతులందు లీల నవతరించి లోకంబుల రక్షించు నని మఱియు సూతుఁ డిట్లనియె. (1-59)
అధ్యాయము - 3
సీ. మహదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై, చారు షోడశ కళా సహితుఁ డగుచుఁ
బంచ మహాభూత భాసితుండై శుద్ధ, సత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ
జరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసా శి,రములు నానా సహస్రములు వెలుఁగ
నంబర కేయూర హార కుండల కిరీ,టాదులు పెక్కు వే లమరుచుండఁ
తే.గీ. బురుష రూపంబు ధరియించి పరుఁ డనంతుఁ , డఖిల భువనైక కర్తయై యలఘు గతిని
మానితాపార జలరాశి మధ్యమునను, యోగనిద్రా విలాసియై యొప్పుచుండు. (1-60)
వ. అది సకలావతారములకు మొదలి గనియైన శ్రీమన్నారాయణదేవుని విరాజమానంబైన దివ్యరూపంబు. దానిం బరమయోగీంద్రులు దర్శించుదురు. అప్పరమేశ్వరు నాభీకమలంబు వలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె. అతని యవయవ స్థానంబులయందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె. మొదల నద్దేవుండు కౌమారాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రాహ్మణుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబు చరియించె. రెండవ మాఱు జగజ్జననంబు కొఱకు రసాతలగత యైన భూమి నెత్తుచు యజ్ఞేశుండై వరాహదేహంబుఁ దాల్చె. మూడవ తోయంబున నారదుండను దేవఋషియై కర్మనిర్మోచకంబైన వైష్ణవ