12
కర్మంబుఁ ద్రుంచి వైతురు. (భగవంతునియందు శ్రద్ధయుఁ దత్కథా శ్రవణాదులం దత్యంతాసక్తియుఁ బుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించును) కర్మనిర్మూలన హేతువులైన కమలలోచను కథలం దెవ్వండు రతి చేయి నిచ్చగించు వాని కితరంబులెవ్వియు రుచి వుట్టింపనేఱవు. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబు లాచరించు. అశుభంబులు నష్టంబులయిన భాగవత శాస్త్రసేవా విశేషంబున నిశ్చల భక్తి యుదయించు. భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామక్రోధాదులకు వశంబు గాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్తసంగుండగు. ముక్తసంగుండైన నీశ్వర తత్త్వజ్ఞానంబు దీపించు. ఈశ్వరుండు కానంబడినఁ జిజ్జడ గ్రథన రూపంబైన యహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు. సంశయ విచ్ఛేదంబైన ననారబ్ధ ఫలంబులైన కర్మంబులు నశించుం గావున, (1-56)
కం. గురుమతులు తపసు లంత: , కరణంబులు శుద్ధి సేయు ఘనతరభక్తిన్
హరియందు సమర్పింతురు, పరమానందమున భిన్న భవ బంధనులై. (1-57)
తరల వృత్తము :- పరమపూరుషుఁ డొక్కఁ డాఢ్యుఁడు పాలనోద్భవ నాశముల్
సొరిదిఁ జేయు ముకుంద పద్మజ శూలిసంజ్ఞలఁ బ్రాకృత
స్ఫురిత సత్త్వ రజస్ తమంబులఁ బొందు నందు శుభస్థితుల్
హరి చరాచర కోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై. (1-58)
వ. మఱియు నొక విశేషంబు కలదు. కాష్ఠంబున కంటె ధూమంబు, ధూమంబున కంటెఁ ద్రయీమయంబైన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబున కంటె రజోగుణంబు, రజోగుణంబున కంటె బ్రహ్మప్రకాశకంబగు సత్త్వగుణంబు విశిష్టంబగు. తొల్లి మునులు సత్త్వమయుండని హరి నధోక్షజుం గొలిచిరి. కొందఱు సంసారమందలి మేలు కొఱకు నన్యుల సేవించుచుందురు. మోక్షార్థులైన వారలు ఘోరరూపులైన భూతపతుల విడిచి దేవతాంతర నింద సేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్తింతురు. కొందఱు రాజస తామసులై సిరియు నైశ్వర్యంబును బ్రజలను గోరి పితృభూత ప్రజేశాదుల నారాధించుదురు.