పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

సీ. కార్యవర్గంబును గారణ సంఘంబు, నధికరించి చరించు నాత్మతత్త్వ

మధ్యాత్మ మనఁబడు నట్టి యధ్యాత్మముఁ , దెలివి సేయఁగఁజాలు దీపమగుచు

సకల వేదములకు సారాంశమై యసా,ధారణమగు_ _ _ప్రభావ

రాజకంబైన పురాణ మర్మంబును, గాఢ సంసారాంధకార పటలి

తే.గీ. దాటఁగోరెడి వారికి దయ దలిర్ప, నే తపోనిధి వివరించె నేర్పడంగ

నట్టి శుక నామధేయు మహాత్మగేయు, విమల విజ్ఞాన రమణీయు వేడ్కఁ గొలుతు. (1-54)


కం. నారాయణునకు నరునకు, భారతికిని మ్రొక్కి వ్యాసు పదములకు నమ

స్కారము సేసి వచింతు ను,దార గ్రంథంబు దళిత తను బంధంబున్. (1-55)


వ. అని యిట్లు దేవతా గురు నమస్కారంబు సేసి యిట్లనియె. మునీంద్రులారా ! నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనంబడిగితిరి. ఏమిటం గృష్ణసంప్రశ్నంబు సేయంబడు నెవ్వింధంబున నాత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకయు నైన హరిభక్తి యే రూపంబునం గలుగు నది పురుషులకుఁ బరమ ధర్మంబగు. వాసుదేవునియందుఁ బ్రయోగింపఁబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు. నారాయణ కథల వలన నెయ్యే ధర్మంబులు దగులవవి నిరర్థంబులు. అపవర్గ పర్యంతంబైన ధర్మంబున కర్థంబు ఫలంబు గాదు. ధర్మంబునం దవ్యభిచారి యయిన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు. విషయ భోగంబైన కామంబున కింద్రియ ప్రీతి ఫలంబు గాదు. ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు. తత్త్వజిజ్ఞాస గల జీవునకుఁ గర్మముల చేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు. తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస. కొందఱు ధర్మంబె తత్త్వంబని పలుకుదురు. తత్త్వవిదులు జ్ఞానమను పేర నద్వయమైన యది తత్త్వమని యెఱుంగుదురు. ఆ తత్త్వం బౌషనిదుల చేత బ్రహ్మమనియు హైరణ్యగర్భుల చేతం బరమాత్మ యనియు సాత్వతుల చేత భగవంతుఁ డనియును బలుకంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞాన వైరాగ్యముల తోడం గూడిన భక్తి చేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మ యందుఁ బరమాత్మం బొడఁగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు. పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి. ఏకచిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపను వర్ణింపను దగు. చక్రయుధ ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతు లహంకార నిబద్ధంబైన