పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

తంత్రంబు సెప్పె. నాలవ పరి ధర్మభార్యాసర్గమునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబు సేసె. పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండై యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వసంఘ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె. ఆఱవ శరీరంబున ననసూయాదేవియందు నత్రి మహామునికి (దత్తుండను పేర) గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాద ముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె. ఏడవ విగ్రహంబున నాకూతియందు రుచికి జన్మించి యజ్ఞుండనఁ బ్రకాశమానుండై యమాది దేవతల తోడం గూడి స్వాయంభువ మన్వంతరంబు రక్షించె. అష్టమ మూర్తిని మేరుదేవియందు నాభికి జన్మించి యురుక్రముండనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుఁ బ్రకటించె. ఋషుల చేతం గోరంబడి తొమ్మిదవ జన్మంబునఁ బృథు చక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె. చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబు నొంది మహీరూపమగు నావ నెక్కించి వైవస్వత మనువు నుద్ధరించె. సముద్ర మథన కాలంబునం బదునొకొండవ మాఱు కమఠాకృతిని మందరాచలంబుం దన పృష్ఠ కర్పరంబున నేర్పరియై నిలిపె. ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మథ్యమాన క్షీర పాథోధి మధ్యభాగంబున నమృత కలశ హస్తుండై వెడలె. పదమూడవది యైన మోహినీ వేషంబున నసురుల మోహితులం జేసి సురల నమృతాహారులం గావించె. పదునాలుగవది యైన నరసింహ రూపంబునం గనకకశిపుని సంహరించె. పదియేనవది యైన కపట వామనావతారంబున బలినిఁ బద త్రయంబు యాచించి మూఁడు లోకముల నాక్రమించె. పదియాఱవది యైన భార్గవ రామాకృతినిఁ గుపిత భావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజుల నిఱువదియొక మాఱు వధియించి భూమిని క్షత్త్రియ శూన్యంబుఁ గావించె. పదియేడవది యైన వ్యాస గాత్రంబున నల్ప మతులైన పురుషులం గరుణించి వేద వృక్షంబునకు శాఖ లేర్పఱించె. పదునెనిమిదవదైన రామాభిధానంబున దేవ కార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబు లాచరించె. ఏకోనవింశతి-వింశతి తమంబులైన రామ-కృష్ణావతారంబులచే యదు వంశంబున సంభవించి విశ్వంభరా భరంబు నివారించె. కలియుగాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు కీకట దేశంబున జిన సుతుండై ఏకవింశతి తమంబైన బుద్ధ నామధేయంబునం దేజరిల్లు. యుగ సంధియందు వసుంధరాధీశులు చోరప్రా