Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


సీ. మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి, నువిద చెంగట నుండ నొప్పువాఁడు

చంద్రమండల సుధాసారంబు పోలిక, ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు

వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ , బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు

నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి, ఘన కిరీటము తలఁ గల్గువాఁడు

ఆ.వె. పుండరీక యుగముఁ బోలు కన్నులవాఁడు, వెడఁద యురమువాఁడు విపుల భద్ర

మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా, కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.(1-14)


వ. ఏ నా రాజశేఖరుం దేఱిచూచి భాషింప యత్నంబు సేయు నెడ నతండు దా "రామభద్రుండ, మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెనుంగు సేయుము, నీకు భవబంధంబులు తెగు"నని యానతిచ్చి తిరోహితుండయ్యె. అంత నేను సమున్మీలిత నయనుండనై వెఱగువడి చిత్తంబున,(1-15)


కం. పలికెడిది భాగవతమట, పలికించెడివాఁడు రామభద్రుండఁట నేఁ ,

బలికిన భవహరమగు నఁట, పలికెద వేఱొండు గాథఁ బలుకఁగ నేలా. (1-16)


ఆ.వె. భాగవతముఁ దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన

విబుధజనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేఁటపఱతు. (1-17)


కం. కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ , గొందఱికిని సంస్కృతంబు గుణమగు రెండున్

గొందఱికి గుణములగు నే, నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్. (1-18)


మ. ఒనఱన్ దిక్కన నన్నయాది కవులీ యుర్విం బురాణావళుల్

తెనుఁగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో

తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్, దీనిన్ దెనింగించి నా

జననంబున్ సఫలంబు సేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్. (1-19)


మ. లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం

జులతాశోభితమున్ సువర్ణ సుమనస్ సుజ్ఞేయమున్ సుందరో

జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై. (1-20)