Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

నమస్కరించి మృధుమధుర వచన రచన పల్లవిత స్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి కతిపయశ్లోక సమ్మోదితసూరు మయూరు నభినందించి మహాకావ్యకరణకళావిలాసుం గాళిదాసుం గొనియాడి కవికమల విసర రవిన్ భారవిం బొగడి విదళితాఘు మాఘు స్తుతియించి యాంధ్రకవితాగౌరవజనమనోహారి నన్నయసూరిం గైవారంబు సేసి హరిహర చరణారవింద వందనాభిలాషిఁ దిక్కనమనీషిన్ భూషించి భక్తివిశేషిత పరమేశ్వరుండగు ప్రబంధపరమేశ్వరుం బ్రణుతించి మఱియు నితరపూర్వకవిజనసంభావనంబుఁ గావించి వర్తమానకవులకుఁ బ్రియంబు వలికి భావికవుల బహూకరించి యుభయకావ్యకరణదక్షుండనై,(1-10)


ఉ. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్

సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముఁ బాసి కాలుచే

సమ్మెట పోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.(1-11)


తే. చేతులారంగ శివునిఁ బూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని

దయయు సత్యంబు లోనుగాఁ దలఁపడేనిఁ , గలుగ నేటికిఁ దల్లుల కడుపుచేటు.(1-12)

వ. అని మదీయ పూర్వజన్మసహస్రసంచిత తప:ఫలంబున శ్రీమన్నారాయణ కథా విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకఁ గని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ యగు గంగకుం జని క్రుంకులిడి వెడలి మహనీయ మంజుల పులినతల మండప మధ్యంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ గించిదున్మీలిత లోచనుండనై యున్నయెడ,(1-13)