5
వ. ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబున హరికరుణావిశేషంబునఁ గృతార్థత్వంబు సిద్ధించెనని బుద్ధి నెఱింగి లేచి మఱలి కొన్ని దినంబుల నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురువృద్ధబుధబంధుజనానుజ్ఞాతుండనై, (1-21)
గ్రంథకర్తృ వంశవర్ణనము
సీ. కౌండిన్యగోత్ర సంకలితుఁ డాపస్తంబ, సూత్రుండు పుణ్యుండు సుభగుఁడైన
భీమన మంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ, కలకంఠి తద్భార్య గౌరమాంబ
కమలాప్తు వరమునఁ గనియె సోమనమంత్రి, వల్లభ మల్లమ వారి తనయుఁ
డెల్లన యతనికి నిల్లాలు మాచమ, వారి పుత్త్రుఁడు వంశవర్ధనుండు
ఆ.వె. లలితమూర్తి బహుకళానిధి కేసన, దానమాన నీతిధనుఁడు ఘనుఁడు
తనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ, మనియె శైవశాస్త్రమతముఁ గనియె. (1-22)
కం. నడవదు నిలయము వెలువడి, తడవదు పరపురుషు గుణముఁ దన పతి నొడువున్
గడవదు వితరణ కరుణలు, విడువదు లక్కాంబ విబుధ విసరము వొగడన్. (1-23)
ఉ. మానిను లీడు గారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి దానధర్మ మతిగౌరవ మంజులతా గభీరతా
స్థానికి ముద్దసానికి సదాశివ పాద యుగార్చనానుకం
పానయ వాగ్‌భవానికిని బమ్మెర కేసయ లక్కసానికిన్. (1-24)
కం. ఆ మానిని కుదయించితి, మే మిరువుర మగ్రజాతుఁ డీశ్వర సేవా
కాముఁడు తిప్పయ ; పోతన, నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్. (1-25)
వ. అయిన నేను నా చిత్తంబునఁ బెన్నిధానంబును బోని శ్రీరామచంద్రు సన్నిధానంబును గల్పించికొని, (1-26)