పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంకిత మియఁబడినశ్రీధరచ్ఛందమున “మంచనవింటివో" యనుక్రీడాభిరామములోనిపద్య ముదాహరింపఁబడినది అనివ్రాసియున్నారు. అళియరామరాజుముత్తాత బుక్కభూపాలుఁడుగాని, సోమభూపాలుఁడు గాఁడు సోమభూపాలుఁడు బుక్కభూపాలునకు ముత్తాత. శ్రీధరచ్ఛందకృతిపతి యాసోమభూపాలుఁ డైనచో క్రీడాభిరామమందలి పద్య ముదాహరింపఁబడుట కవకాశము లేదు. శ్రీధరచ్ఛందమును జూచిన గాని సత్యమును నిర్ణయింపఁజాలము.

ఈక్రింది పద్యము శ్రీధరచ్ఛందములోనిదని లక్షణగ్రంథములలో నుదాహరింపఁబడినట్లు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులుగారు వ్రాసియున్నారు.

క.

మయరసతజభగణంబులు
నయ ధన భయ విలయ బంధన శ్రీ తేజో
జయములు క్రమమున నొసఁగును
ప్రియసరసవచోభిరామ! పిన్నయసోమా!

దీనిని బట్టియుఁ పైనివాసిన “సురనర” అనుపద్యమునుబట్టియు, శ్రీధరచ్ఛందకృతిపతి పిన్నయసోమభూపాలుఁ డని దెలియుచున్నది. పిన్నయసోముఁడు ఆరెవీటివారిలోనున్నాడు. కాని యాతఁడు పైనిఁ జెప్పినట్లు బుక్కరాయలకుఁ బ్రపితామహుఁడు. శ్రీధరచ్ఛందములోనిదని పైని నుదాహరించిననాల్గవపద్యములో "శౌరి" యని సంబోధన మున్నది. దీనిని బట్టి యీగ్రంథము సోమభూపాలునకుఁ గాక దేవున కంకిత మీయఁబడియున్నదనియు, నీపద్యములు వేఱువేఱుగ్రంథములలోని వయియుండుననియుఁ దోఁచుచున్నది. పైని వ్రాసినట్లు గ్రంథమును జూచినగాని యిదమిత్థమని నిర్ణయింపలేము.

లక్షణదీపికను రచించిన గౌరనమంత్రి శ్రీధరచ్ఛందమునుండి లక్ష్యములను గైకొని తనగ్రంథమున నుదాహరించెనని కొంద ఱనుచున్నారు. ఆంధ్రసాహిత్యపరిషత్తునందు గౌరన లక్షణదీపికలు రెండుప్రతు లున్న వనియు న౦ దొకదానియందు శ్రీధరునిఛందమునుండి యుదాహరణము లున్నవనియు రెండవప్రతియందు లేవనియు, బ్ర. శ్రీ. చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు ఆంధ్రసాహిత్యపరిషత్ప్ర్పత్రికయందు వ్రాసియున్నారు.