పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవము

శ్రీగురుం డర్థితో శేషాద్రియందు
యోగనిద్రాకేళి నున్నయత్తఱిని

వనజాసనాదిదేవత లేఁగుదెంచి
వినుతించి రప్పు డవ్విధ మెట్టిదనిన
 
శ్రీకర! వేంకటక్షితిధరావాస!
నాకేంద్రనుత రమానాధ మేల్కనుము

వసుదేవదేవకీ వరగర్భజాత
కిసలయాధర రామ కృష్ణ మేల్కనుము

తపము పెంపున యశోదానందులకును
గృపతోడ శిశువైన కృష్ణ మేల్కనుము

పూతనాకై తవ స్ఫురితదుర్వార
చైతన్యహరణ ప్రశస్త మెల్కనుము

అఱిముఱి శకటాసురాంగంబు లీల
విఱుఁగఁదన్నిన యదువీర మేల్కనుము

సుడిగాలిరాకాసి స్రుక్కడంగించి
గెడపినకెదుబాలకృష్ణ మేల్కనుము

మద్దులఁ గూల్చి యున్మద వృత్తి మెఱయు
ముద్దుల గోపాలమూర్తి మేల్కనుము

అద్రిరూపంబైన యఘదైత్యుఁ జంపి
రౌద్రంబు నెఱయు భూరమణ మేల్కనుము