పుట:Snehageetalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
పుట్టువున్నచోట పుడకలుండు
మనకుమాత్ర మౌనె మరణమ్ము భువులోన
కాలధర్మమిదియె కాలమిదియె 470

తనువు గలిగియున్న తగుశిక్ష వెన్నెంటు
దానినెవ్వరేని దాటలేరు
తెలిసి యనుభవించు ధీశాలి ముదమున
అంగలార్చి మూర్ఖుడనుభవించు 471

సత్య సృష్టినరయ సర్వజనులొకటే
వేఱుచేసిచూడ వెరవుగాదు
వస్తువున్నచాలు వాసమరయనేమి
దైవసృష్టిలోని ధర్మమొకటె 472

చాడికోరు, దొంగ, జారుండు, ఋణదాయి1
అక్షకుండు, కపటి యనెడివారు
వరుస బంధమైన వర్జింపదగువారు
విడిచినపుడె బ్రతుకు వేడుకగును 473

వస్తు మోహమొకటి, వన్నె మోహమొకటి,
వలపు మోహమొకటి వదలలేము
మోహభ్రాంతిలోన మునిగితేలెడివాని
స్వీకరించలేడు శివుడుకూడ 474

ఆడిపాడు గాక ఆనందపడు గాక
పొగడుగాక ధనముబూన్చుగాక
గురుని బోధలేక గురిరాదు! భువిపంట
విత్తకుండ మొలక లెత్తగలవె! 475

అర్కతేజుడైన అమృతకిరణుడైన
వెలుగులేనివాడు విలువలేదు
ఎవనిఅంశువైన ఎట్టివెలుగులైన
వానియందె పుట్టి లీనమగును 476

కొలనులోన చేరి కలహంస తోడుగా
ఒక్కచోట గడుపు కొక్కెరాయి
పాలునీరు కలిపి ప్రారబ్దమందింప
చెలగి కొంగ హంస బలిమితెలిసె 477

కట్టె విరిచి తిరిగి కలపంగనతుకునా
నీరు కోసిచూడ వేరుయగునె
కోరి కాడువాడు ‘గోరఖు’ డొక్కడే
ప్రాపులేక ఇహము పరములేదు 478

నీరనిధిని1 యుండె నీటిపడవొకటి
అందు పడగవిప్పి అగుము2 నిలిచె
విడువ పడవబోవు విడకున్న కాటేయు
ఏదిదారి రామ ! ఏమిచేతు ? 479

చిలుక చేరియుండె చిరజీవ వృక్షాన
చంచువు సరజేసె మించుగీర3
కాలమెలమి రాగక్ష్మాజమ్ము విడనాడె
చెట్టుకేది విలువ చెప్పవయ్య 480

చవిటినేల విత్తి సాగుజేసెడి చోట
ఎంత వానకురియ నేమి ఫలము
ప్రేమలేని వాడు రామనామ భజన
మెంతజేయుగాక నేమి ఫలము 481

బహిరపరచి చెప్ప భరింప జాలరు
కప్పి పెట్టి యుంచ కానలేరు
సత్యదర్శనమ్ము సాము గరిడిసాటి
తెలిపి వైరమేల తెచ్చుకొనుట ! 482

చుక్కవెలుగు వరకు సూర్యుండు రాలేడు
‘తరణి’4 యున్న చోట తమము లేదు
చేతనమ్ము గలుగ చేత చెదరిపోవు
మర్మమెరిగినపుడె కర్మ తెగును 483

నీదు కాళ్ళమీద నీవు నిల్వగమేలు
పరుల ప్రాపుగోరి పరుగులొద్దు
వాకిచదరిపారు వాహినింగనలేక
<poem>