పుట:Snehageetalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
కట్టువడదు మనసు కలిగిన జ్ఞానాన
మనసులేక జ్ఞాన మహిమలేదు
నీరు కలువలోన నిలిచి కట్టువడును
నీరులేక కడవ నెలవు లేదు 456

మనసు మనిషి కెపుడు మాయావిచేకోతి
తాడు చేతబట్టి నడప వలయు
కదురుబట్టి నూలు కండె జుట్టియట్లు
మనసు చుట్టి పెట్టి మసులు కొమ్ము 457

మనసు మోసకారి మరలతో ముంచెత్తు
లక్ష గడపలున్న రచ్చయద్ది
మునులు దివిజులైన మోసపోయెదరన్న
మనసు అదుపునుంచి మర్మమెఱుగు 458

తిరిగి తిరిగి దేశమ్ములన్నియూ
తిరుగలి వలనచటె తిరుగుచుంటి
మనసు కదలనపుడు మనిషి తిరుగనేమి?
మదిని తరచి వెదుక మాయతొలగు 459

కన్నుమూసినంత కలలోన రాముండు
కన్ను తెఱవ ఎదుట కపిరథుండు
నేత్రమే ఋజువగు, నిజము కబీరుకు
మరువలేను విభుని వెరపురాదు 460

సుఖము దఃఖమెనవి చూపుల చేరవో
అట్టివాని చెలిమినందుకొందు
అతని కలిసియాడి అతని కలిసిపాడి
అతనితోటి బ్రతుకు ననుసరింతు 461

చల్లనైన నీడ సరసమైనవి పండ్లు
అందమైన పూలు ఆకు సిరులు
పడని గాల్చిపీల్చి ప్రాణవాయువు నిచ్చు
చెట్టు పెంచుటెపుడు చెఱుపురాదు 462

సాధుజనుల పొందు, సహజ తరువనమ్ము
చల్లనైన సరసు, నల్లమబ్బు
పరులు మేలు కొఱకె ప్రాదుర్భవించును
పరహితమ్ము సాక్షి ప్రకృతి గాదె 463

పరులు బ్రతుకు తెలిసి పరులబాధ తెలిసి
పరులతో మెలగును పరమహంస
పరుల నెఱగలేని ప్రల్లదుండెన్నడూ
యోగికాడు మాయభోగిగాని 464

వంగిన ప్రతివాడు వాసి చాలకగాదు
తగ్గియుండుటన్న తరుగుకాదు
దొంగ, చిఱుత, విల్లు వంగినపుడె వాడి
వంగియున్న వాడె నింగికెగయు 465

స్వాతిచినుకు ద్రావి జాతిముత్యమునిచ్చు
కాకి చిప్ప చెన్ను కడలి కొప్పు
ఉనికి జలధిగాని ఉప్పునీరు గొనదు
విలువ జూతురెల్ల విబుధులెపుడు 466

నేలబడిన చుక్క నీరైన తాకదు
చండవేడినైన చాతకమ్ము
మేను కష్టపెట్టు మేఘునడబోదు
జాతి పౌరుషమ్ము నీతిగాదె 467

వెదకి వెదకి వెదకి వేసారి పోయితి
బిందు వెక్కుడుండె ! సింధువయ్యె !
వేరుచెయగలుగు వారెవ్వరిలలోన
ఆత్న కలసిన పరమాత్మ వెలుగు 468

బీజమందొదిగి మహీజముండెడురీతి
ఆత్మయందె సర్వమణగియుండు
ఆత్మకలుషమైన అన్నియూ కలుషమే
చిత్తమర్మమెఱుగ చింతలేదు 469

అంత్యగమనమన్న అంతటి భయమేల
<poem>