పుట:Snehageetalu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
అందు ముగురు మూర్తులవతరించె 441

సృజన,ఉనికి, లయము సృష్టికి మూలమ్ము
ముగురు మూర్తులకవి ముఖ్యవృత్తి
పిదప నుద్భవించె ప్రియమైన లోకాలు
ఆదిపురుషునిచ్చ అమృతకరము 442

అన్ని భావములకు ఆది సప్తశ్రుతులు
శ్రతుల గతుల జరిగె సృష్టియంత
లయము శ్రతులలోని లాలిత్య జీవమ్ము
కాల ధర్యమదియె కలిమి అదియె 443

చావు పుట్టుకెనడి చదరంగ జూవన
మ్మంటి సుఖము దుఃఖ మలదియుండు
మాటికొచ్చి విభుడు యేటిని దాటించి
చెప్పలేని భ్రమల నప్పగించు 444

ఇట్టి జ్ఞాన మసరి ఇంగితమ్ము తెలిసి
పరిఢవిల్లువాడు ప్రాజ్ఞడగును
అతడు శ్రుతులు దాటి ఆనందనాదాన
హంసలందు కలసి యాడుచుండు 445

మనసు కోరినట్లు మనుట సాధ్యమగునె
పొత్తురాదు జీవి పోకడలకు
మనసు నదుపుజేసి మనువాడె సాధువు
అట్టి సాధునెవరు? అవని మీద 446

కోర్కె బట్టి పోవు కోరిప్రపంచమ్ము
శాస్త ననుసరించు సాధువెపుడు
గురువు వెంట నడక గురుతుగా సాగును
గురువులోని దారి గుడ్డిదారి 447

చిత్త మైదు కరణ వృత్తులం దమియించె
వదలి పోవజాల వహ్నికీల
శబ్ద రూప రసన స్పర్శ గంధమ్ముల
నావహించి సత్యమలరుచుండు 448

అరయ జీవుడొకడు ఆర్గురు శత్రువుల్
అందరొక్కసారి ఆవహించు
వాటి చవుల కొఱకు వారాంగనను చేసి
ఆటలాడ జేయు నాత్మనెపుడు 449

అబ్ది తరగలెన్నొ ఆత్మ పరుగులన్ని
మనసునందు బుట్టి మరులు గొలుపు
మనసు కాకియైన మలినమ్ము దినుచుండు
హంసయైన ముత్యమరసి తినును 450

ఆది దైవమార్గ మంతరాత్మ నిలిపి
హద్దులోన కాపు ‘బుద్ధి’నుంచి
తనువు మనసు మరచి తగుమార్గమునబోవ
రామరాజ్యపథ సుగామివగదు 451

మనసు స్థూలమగును మనసు సుక్ష్మమగును
మనసు నీర మగును మనసుమండు
మనసు వన్నెలాడి, మారును వరుసగా
మార్పు నెఱుగునట్టి మాన్యుడెవరు! 452

దర్పణమ్ము గలదు దరహాసహృదయాన
దానియందు ముఖము కానరాదు
మనసులోని ద్వంద్వ మాలిన్య ముడిగిన
మొగము కానపించు ముకురమందు 453

మనసులోని కోర్కె మర్ధించగలిగిన
అంతకంటె మిగుల అందమేది?
పద్మకాంతి తలకు పై పైన వెల్గును
కోర్కెలేని ఎదకు కొదువ లేదు 454

మనసు భీకరమగు మత్తేభ తుల్యము
దాని వెనుక కాంక్ష దాగియుండు
బుద్ధి అంకుశమున భూరిమదగజము
నణచ పొందగలవు అమృత ఫలము. 455
<poem>