పుట:Snehageetalu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
కుటిలమాటలయందు క్రోధాగ్నియుండును
పలుకువాడె ముందు భస్మమగును
సాధువచనమందు సకలసుధలుపండు
శ్రమనుమరువజేసి సౌఖ్యమిచ్చు 342

పెరకలేనిముల్లు పెనుకంటకపు’ మాట’
గుచ్చుకున్న ఎదను కొఱికివేయు
అంకుశమ్మువంటి అదటుమాట వినక
చెవులు మూసుకొనుట చివరిమందు 343

మధురమైనమాట మందుతో సమమౌను
మనసునంటు బాధ మాన్పగలదు
కుంటుమాటలెపుడు కంటకమ్మైగ్రుచ్చు
ఒడలు కుళ్ళబొడిచి యుల్లసిల్లు 344

లోభివాని మనసు లాభసంప్రీతిచే
విషయ వాసనలకు వీడు1 గాదె!
ఆయము న్నచోట అజుడెట్లు నివసించు
భక్తి-ధనము కలిసి బ్రతుక గలవె 345

తృష్ణయున్ననాడు తృప్తియుండగబోదు
తృప్తిలేనిబ్రతుకు తృణసమమ్ము
‘ఇచ్చ’ జోలికేగి యిరుకున పడబోకు
కలుష భారమెంతొ తలకుజేరు! 346

భక్తియున్నచోట బంగారముండదు
సొమ్ములున్న భక్తి యిమ్ముగాదు
మావి గప్పినట్లు మాయ లోభముకమ్ము
విషయసుఖము దానివెంట వచ్చు 347

అల్పుడైనవాని అభిమానమంతయు
దానమడుగునాడె దాటిపోవు
మరచిపోవు చెలిమి, మరియాదనశియించు
నిక్కువమ్ము లోభి కుక్కసాటి 348

జగతి నిండియుండు జాలమై మోహమ్ము
దానినెవ్వరేని దాటలేరు
తత్త్వమరయు సాధు తరలివచ్చినపుడె
మోహపాశముడుగు దేహమందు 349

మోహమనెడి మాయ దేహమ్మునంజిక్కి
జగములాడుచుండె జాణలట్లు!
సుగతినిచ్చి మనువు, జగదీశ్వరునిబాసి
మళ్ళిగర్భమందు త్రుళ్ళబోకు 350

సారముండువరకు సంసారమునుండును
దేహముండుదనుక మోహమలరు
మూడువేళలందు మూడుకొమ్మలూ
మోహమందుచిక్కి మునిగితేలు 351

గొప్ప గొప్ప బుధులు, గొప్ప వేదవిదులు
మోహజలధిలోన మునిగివారు
ధ్యానమనెడి చిన్న మీనమ్ము మాత్రమే
ఏటికెదురు ఈది దాటగలదు 352

ఎవనిగూర్చి మునులు ఇంతశ్రమింతురో
అవనికంత దిక్కు అతనిచూడ్కు
ఎవరినిగూర్చి శ్రుతులు ఇంతగాజెప్పెనో
అట్టి విభుని చేయినందుకొనుము 353

మూడుదశలు గడచి ముగ్గుబుట్టగమారి
కఱ్ఱనూతగొన్న వెఱ్ఱివాడ
పిల్లి1 పొంచియుండె పేరాశపడనేల?
నిన్నె అంటియుండు నీడదండి2. 354

అదిరి పదచు కుక్క అద్దాలగుహలోకి
పరుగు పరుగుతోడ నరిగెనపుడు
తనదు బింబతతిని దాయలంచు భ్రమించి
మొఱిగి మొఱిగి చచ్చె! మోహమదియె. 355

మాయ తొలుగుగాని మానమ్ము3 తొలుగదు
మానమంటిపెద్ద మాయచేఱు
<poem>