పుట:Snehageetalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
మైల మైలయంచు జలకంబులాడిన
మనసులోని మైల మాన్పగలవె
ఎల్లవేళ చేప ఏటిలోనుండదా
కంపు బాపగలమె కడిగి కడిగి 328

విద్యలెన్ని నేర్చి విద్వాంసుడైననూ
సంశయములు తొలగ సాధ్యమగునె
అరలు1 గలుగునాడు అనుమానమేరాదు
భావప్రేమ గలుగ ప్రాజ్ఞుడగును 329

చదువులెన్ని చదివి సంభూతు2 లగుగాక
సంశయములు పోవజాలవెపుడు
శంక పెరిగి నీకు శరజాలమైపోయి
అలఘ దుఃఖహేతువగును తుదకు 330

దివిటి బట్టువాడు తిమిరాన నుండును
కానుపింపజేయు కానరాడు
పరమహంస కూడ ప్రతిమానుడే సుమా!
పరమపథము జూపి మరుగునుండు 331

కాయమంత నిండె హేయమౌగర్వమ్ము
అహము విడువేని హరియు లేడు
ప్రాణులందు వైరభావమ్ము విడనాడు
సాధు మతమునున్న సారమిదియె 332

బడుగు జీవికైన బంధములెన్నియో
కలిగియుండుటదియె కాలమహిమ
బంధనములుబాప భగవానునికిగాక
సాధ్యమగునె ఎట్టి ‘సాక్షి’3 కైన 333

పాపతాపములకు రాపమ్మునీవైన
బాధపడకు ఆత్మశోధకుండ
కోటి కర్మలున్న గోటితో తొలగును
రామనామ మంత్ర రక్షయున్న 334

కామి ప్రమిదలోని కాలుచుండెడివత్తి
తైలమింకిపోవ తానుకాలు
సాధుజనుడు రత్న సాదృశ్యమైయుండు
ఎల్లవేళ వెలుగు పల్లవించు 335

విషయ సుఖములంటి విలువైన బ్రతుకును
కాలదన్నుకొనుట కామితంతు
చేతులార మణిని చేజార్చుకున్నాక
జననఫలము పోయె జన్మపోయె 336

అంశుడు1 న్నచోట అంధకారము లేదు
రాత్రియైనవేళ రవియులేడు
కామమున్నదరిని నామమ్ము నిలువదు
నామమున్నతావు కాముముడుగు 337

దాయలారుగురును2 దాపులోనుండగా
పండితుండయినను పనికిరాడు
చదువులేదుగాక శత్రువు3 ల్లేనిచో
నతనితోడు మనకు అభయమగును 338

కామమనగనేమి? కామరూపమ్మేమి?
కామ శబ్దమార్గ గమ్యమేమి?
మనసునందు బుట్టి మరులభ్రమలుజుట్టి
మనిషినే దహించు మాయసుమ్ము 339

క్రోధమంటి వెంట కోటి చెడుగులుండు
ఆహమునంటి క్రోధ మమరియుండు
మదిని’అహము’చేరు మార్గముండినచాలు
‘మంచి’ క్రోధమందు మాడిపోవు. 340

కుటిలమైనమాట జటిలమైనశరము
కర్ణమందుజొచ్చి కలకబెట్టు
సవ్యమైనమాట సకలజనులగాచు
‘సుద్ది’ శుద్ధమౌట సుకృతమోయి 341
<poem>