పుట:Snehageetalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
మైల కడిగివేసి మనసు తేటపరచి
శుద్ధమైన వెల్లబుద్ధినొసగు
ఓజ ప్రాపుజేర నొనగూడు సర్వమ్ము
అఘమువీడి మనసు అద్దమగును 228

చాకి నూలుబట్ట చలువ జేసినయట్లు
గురుడు ఛాత్రునుదికి గుణము చూపు
ధ్యానమనెడు బండ దైవమ్ము సబ్బుగా
అదనుజూచి యొజ్జ పదునుబెట్టు 229

గురుని పోల్చిచూడు కుమ్మరి తానౌను
తట్టి కడవ జేసినట్టు లొజ్జ
దండనమ్ము తోనె దరిజేర్చుకొను ఛాత్రు
బొధనమ్ము బంధ సాధనమ్ము 230

విధుడు1 కినుక బూని విడిచిపెట్టినగాని
గురుడు ఎదనుజేర్చి గురుతుజెప్పు
దేశికుండు విడువ దిక్కెవ్వరిగ నీకు
విడువరాదు విదుని2 నీడ నెపుడు 231

హరిని జేరుకొనగ హరినె శరణుజొచ్చ
తడవుబట్టు అతని దరికిజేర,
దైవ దరికిజేర్చు దారి యొజ్జకెరుక
లిప్తలోనజేర్చు నాప్తుడతడు. 232

గురుడు స్పర్శవేది గుణము గంధపుధూళి
అతనినీడ నీకు అమృతమయము
ముక్తియొసగు ఫలితశక్తి గల్గినవాడు
బుధుడు, దివ్యుడతని పోలికెవరు? 233

చదివినంత నీకు సాయుజ్య ధర్మాల
ఎఱుక చిక్కబోదు ఎక్కడైన
గురుడు ఎఱుకజేయ గురిచిక్కు నీలోన
ఎఱుకలేక ముక్తి నెఱుగబోము 234

మూడులోకములను ముమ్మారు ఖండముల్
వెతికిచూడు, గురుని జతకురారు
ప్రభువు మాటకన్న ప్రాజ్ఞుపలుకుమిన్న
చదువుదాతకెవరు సాటిలేరు! 235

హరిని విడుచునేని గురుని చేరగవచ్చు
హరినిజేరు దారి నతడుచూపు
గురుడు విడుచువాని హరయు చేరగనీడు
శిక్షనిచ్చువాడె రక్షనీకు 236

ఎచట వస్తువుండ నచట వెదుకమేలు
మర్మమెఱిగినపుడె కర్మసాగు
ధర్మమెఱిగి బోధ దయచెప్పగలవాని
వెంటనంటియుండ తంటలేదు 237

వేల్పుబువ్వ గురుడు విషవల్లి దేహమ్ము
ఛాత్రు నమృత మయుడు చక్కబెట్టు
దేహమిచ్చియైన దేశికుంజేపట్టు
చీకటింటదివ్వె శిక్షకుండు 238

కోటి సూర్యక్రాంతి కోటి చంద్రులకాంతి
కానరాదు మదిని కాంతి లేక
ఒజ్జ లేక నీవు సజ్జనుండెట్లౌదు!
గురుని విడువరాదు మరణమైన! 239

గురువు లేనిచోట అరుణకిరణరేడు
నిలిచియుండుగాక వెలుగురాదు,
సత్యదేశికునికి సరిరాడు దినరాజు
పావనమ్ము గురుని పాదస్పర్శ 240

మూర్ఖుడైన యొజ్జ మూగవానికి సాటి
వేల రూకలిచ్చి విడువవలయు
అదునుపదునులేని అధ్యాపకుండేల
వాగుదాట రాళ్ళు పనికిరావు 241

అన్ని తెలిసిగూడ నర్థమ్ముగలనేడు
<poem>