పుట:Snehageetalu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
దాతయగునుగాక ధనమురాదు 213

కలికి సాధ్వియైన కాంతునే స్మరియించు
కలనుగాని పరుని తలచబోదు
భక్తుడెన్నడైన భగవానునెడబాసి
బ్రతుక గలడె సుపతివ్రతము వోలె 214

మగనిగొల్చు పడతి మరియాద మీరంగ
పరులముందు పతిని బలుకనట్లు
విభుని స్నేహమందు వివశమందిననాడు
నామజపములేక నష్టమేమి 215

సర్వరూపుడతని సామీప్యమందక
ఎంత తెలుసుకున్న నేమిఫలము
ఒక్కడతడు తెలియ నొనరు సర్వస్వమ్ము
అతడు తెలియకున్న అందదేది! 216

కొమ్మసాగియుండె రెమ్మలాందోళించ
ఆకు కదలుచుండె నలరులూగె
అన్ని తెలిసెరగాని అరయలేము, మూల
మరయగల్గు నతనికాంక్షయేమి 217

సింధురంపురేఖ సింగిరమౌ కళ్ళు
సిరులు పంచుకున్న మరలురేడు
నాదుకనుల నిండి నటియించుచున్నాడు
అన్యమేది నేత్రమరయలేదు. 218

ఎన్ని జాములైన ఎన్ని ఘడియలైన
ఎవరకొరకు నేత్రమెదురు జూచు?
ఆదియంతమఱుగు నతని జూచుటకన్న
కనులకున్న గొప్ప కలిమియేమి? 219

మనసు తేటయైన మగనాలికెన్నడూ
కాలధర్మ భీతి కానరాదు
చేత కుంకుమంబు నూతగా ధరయించి
నిలుచు నారి కెదిరునిలుచు నెవరు? 220

సులువనంగ రాదు సుందరజూవనం
చుట్టు నిప్పుతడికె కట్టియుండు
నాల్గు దిక్కులందు నడయాడు కాలగ్ని
గడచి ధవునిచేరు పడతి పడతి 221

మగనిపడక జేరి మదిని వేరొకరితో
మేలమాడు జాణ లీలవోలె
అంతరమ్మనుతెఱ నడ్డముంచెడివాడు
అంతరాత్మ విభుని యంటబోదు 222

సద్గురుకిలలోన సాటి ధనములేదు
ధరను తపసి మించు దాతలేడు
అవని జాతిలేదు హరిభక్తులతు మించి
హరికిమించి హితుని అరయలేము 223

గురువునొక్కవైపు, గోవిందుడొకవైపు
పాదమంటి యెవరి పరిచరింతు!
గురువు చూపువాడు గోవిందుడేగాన
గురుని పాదమొకటె గురుతు నాకు 224

మన్నువంటి నన్ను మహనీయుడను జేసి
పుణ్యతేజమిచ్చి బ్రోచినట్టి
చదువులయ్యకెట్టి సన్మానమందింతు!
ఆత్మసాక్షితోడ నంజలింతు! 225

కాగితముగ భూమి కలముగా వృక్షమము
సాగరమ్ము ‘మషి’ గ సరకుజేసి
ఎంత సొగసులద్ది యేమివ్రాసినగాని
గురునిగుణము చెప్ప తరముగాదు 226

విషయవాంఛ విడచి విశ్వదాత దలచి
అహము తుడిచిపెట్టి అజునిజూచి
మదిని గురువుమాట మరువకయుండు వా
డెవ్వడేని ధన్యుడిలనుజూడ. 227<poem>