పుట:Snehageetalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుడమి ధవుని రూపు పొడమదాయె 128

స్వామి కొలుచుటందె సారముడిగి పోయె
కాశ్యపమ్ము1 చివికి కాలిపోయె
కాని తనువుకేమి కష్టమ్ము కలగదు
ప్రభువు సేవ కొఱకె పలకరించు 129

విరహ మెరుగలేక విశ్రాంతి గనినంత
కించపరచ వద్దు కొంచమైన
వలుపులేని కట్టె వల్లకాటికి దిబ్బ
ఎడము లేక రాదు యెలమి ఫలము 130

పగలు రాత్రి గడచి పలుమాసములు దాటి
కాలగమనమెంతొ కరిగిపోయె
విభుని చూడలేని విరహిణి దుఃఖమ్ము
తాళలేక తలువు తత్తరిల్లె 131

గురుని నెవరు దక్కి గురుతు నాదగునాడు
నామమందు భక్తి నాటుకొనెను
నామమెచట పండు రాముడచట నుండు
అదియు గురుని కరుణనమరుగాదె 132

దర్పణమ్మనందు దర్శించు అతివను
పొందుగల్గు టెట్లు పొసగునోయి
నామమందు సుంత ప్రేమలేని ఎదకు
స్మామి నందుకొనుట సాధ్యమగునె 133

ప్రాణముండు వరకు పరితపించెద గాక
ఫలితమేమిటగునో ప్రభువెఱుంగు
రామదర్శనమ్మె రస పుట్ట ఫలితమ్ము
ఊపిరుడగానె నొడయుగాక 134

నిహతినంది పిదప నిను నేను కలసిన
అలుపుగాక రామ అమరునెద్ది
మట్టి గలిసిపోయె ఎట్టి లోహమునైన
పరుసవేది వలన ఫలితమేమి 135

దేహమొక రబాబు తీగలు నాడులు
మీటు విరహమెపుడు చాటుగాను
అందు నుద్భవించు నాహవ నాదమ్ము
శివునిచేరు పరుల చేరబోదు 136

నన్ను మరచి పోయి నాలోని ప్రేమను
ఉత్తరించబోకు విత్తధార
ఎట్టి వేళయైన ఎడబాటు నోర్వను
బ్రతుకునందుగాని మృతినిగాని 137

తనువు మనసు గాల్చి తత్త్వమరయగల్గు
జీవుడెంత విరహ భావుకుండు
సుఖము దుఃఖమందు సూక్ష్మమై యున్నట్టి
వేదవిదుని మరచు వేళ గలదె 138

తనువు గాయపరచి తత్త్వము తెల్పడి
పరశు వగును విభుని వలపువంత
విరహమతిశయించి పరలోక గతమైన
భ్రమలు తొలగిపోవు, ప్రమద పోవు 139

విరహభక్తి యెదను వికలమ్ము సేయగా
వైద్యుడేమొ నాడిబట్టి చూచు
ఎదను మండు బాధ సదయు డెరుగుగాని
పరులకేమి తెలియు భ్రమలు తప్ప 140

విరహబాణ ఘాత మురమున నాటుచో
ఎట్టిమందులైన పట్టబోవు
అరచియరచి అతడె ఆత్మశాంతిని బొందు
తన్నుకొనుచు తానె తరుణమెరుగు 141

చేతలరయబోకు చేయి విడువబోకు
విభవ సాగరమున వేగుచుంటి
తామసంపు శరధి దాటించకున్నచో
మాయ నన్నుబట్టి మేమునయ్య142