పుట:Sinhagiri-Vachanamulu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

యాశలనెడు రాక్షసుల పేరడంచి, మమతమండోదరని బట్టి దాసిగా నేలి, యాచార్యుండనెడు హనుమంతునిఁ బంపి, యాలంకఁ జొచ్చి, సాధించి, జీవుండనెడు సీతను దెచ్చి మీపాదారవిందముల భక్తికి హత్తించి దరిచేర్చుమీ, యతి రామానుజముని వరము, దాతారు. అనాథపతీ, స్వామీ. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

5

దేవా, పెద్దతనంబు చేసి మిమ్ము మెప్పించెద నంటినా, జాంబవంతుడు మీసన్నిధినే యున్నాడే. దేవా, బుద్ధిని నే మెప్పించెద నంటినా, విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే. దేవా, బంటుదనంబు సేసి మిమ్ము మెప్పించెద నంటినా, యంజనాసుతుండు హనుమంతుండు మీ సన్నిధినే యున్నాడే. దేవా, తీర్థంబు లాడి మిమ్ము మెప్పించెద నంటినా, గంగాభవాని మీ యంగుష్టంబు నందే యుద్భవించి యున్నదే. దేవా, ప్రదక్షిణములు చేసి మిమ్ము మెప్పించెద నంటినా, సూర్యచంద్రాదులు మీసన్నిధినే యున్నారే. దేవా, వేదవేద్యుండనై మిమ్ము మెప్పించెద నంటినా, బ్రహ్మ మీ నాభికమలమం దుద్భవించి యున్నాడే. దేవా, గీతప్రబంధముల చేత మిమ్ము మెప్పించెదనంటినా, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనక ససందన సనత్కుమార పరమ భాగవతులు, నారదాదులు మీ సన్నిధినే యున్నారే. దేవా, సత్యంబుల చేత మిమ్ము మెప్పించెద నంటినా, సత్య హరిశ్చంద్రుడు మీ సన్నిధి యున్నాడే. ధనధాన్యంబుల చేత మిమ్ము మెప్పించెద నంటినా, శ్రీ మహాలక్ష్మి మీ యురమందే యున్నదే. దేవా, శాంత శమదమాది గుణంబుల చేత నోర్పు గలిగి యుండెద నంటినా, భూదేవి మీ సన్నిధినే యున్నదే. దేవా, విందులు వెట్టి మిమ్ము మెప్పించెద నంటినా, విదుర భరద్వాజ శబరి మొదలైనవారు మీ సన్నిధినే యున్నారే. దేవా, ఏకాదశీ వ్రతాదుట మిమ్ము మెప్పించెద నంటినా, రుక్మాంగదుండు మీ సన్నిదినే యున్నవాఁడే, దేవా, భక్తి వైరాగ్యంబులఁ జేసి మిమ్ము మెప్పించెద నంటినా, ప్రహ్లాదుఁడు మీ సన్నిధినే యున్నవాఁడే. దేవా,