పుట:Sinhagiri-Vachanamulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు


4

దేవా, తనువులు మాయ, తలపోసి తలపోసి చెప్పెద నంటివా కఱకఱల మోహ మిది. ఆశలపాషాణం బిది. అతుకులజల్లెడ యిది. తన బ్రతుకుకొఱకు పోరాడి పోరాడి యొరులం జెఱచెడు దుర్గంధపు డొంక యిది. నీరుబుగ్గ, ఊటచెలమ. తూంట్లబాన. తొడరి దుర్గంధమునఁ బొలు(చు)ను. మాటలేకాని మఱియెందును బస లేదు. నోఁటను ముఱికి. దంతంబుల పాఁచి, నాసికంబున ఊళె. నయనంబున పీళె. చెవిలోని గుల్మి చెట్టలకొంప. మూటగట్టికొన్న మలమూత్రముల తిత్తి. చీమునెత్తుటి జడి పురుగుల జలదారి. చిచ్చుటి రోత. పైత్యపుగోళ. పైఁగలపంచారం బిది. తోలుగప్పిన డొలుసు మ్మిది. నమ్మికలేదు. నమ్మిక లేదు. ఇది నాటకములాడెడు బూటకముల బొమ్మ. అమ్మమ్మా! ఈబొమ్మయుత్తమ(గుణము) లెంచి చూచెదనంటినా, కామియై, పామై, గ్రామసూకరమై, యెలుకయై, ఊతయై ఊతలోని మ్రానై , కత్తికోతలం బడి, చచ్చి చచ్చి, పుట్టి పుట్టి, యీఁగయై, దోమయై, యెగిరెడు పక్షియై యనేకజీవజంతువుల యోనియందు బుట్టి, బండై, లండై, లండు పసరంబై, ఆలోనమీనై, మ్రానిమీద మర్కటంబై, వెక్కసంబు డేగయై, డేగకాలితొండయై, గండభేరుండ గజసింహశరభ శార్దూలంబులై, రాగియై, కంచి, యినుమై, యుక్కునై, పులినోటి రాయియై, చకచకలుగాను, పకపకలుగాను, చక్కిళ్ళంబడి, చక్కని కోటయై, గుడిగోపురంబై , కారమై, వికారమై, మధువై, చేదై , యతిమధురంబై, యలసి సొలసి యంగడిసరుకై యావెనుక శోణకంబై జన్మించును. దేవా, యదియు విడుపై నరుండై జన్మించును. దేవా, అప్పప్ప! ఇందో యందో యనుచు తప్పించుకపోను సందు లేక, ఎనుబదినాలుగులక్షలకోట్ల జీవజంతువుల బోనులో తగిలి, గంగలో నోడ పగిలినట్లు, మహాపాతకంబునం దగిలి, కుమ్మరిసానవలె, దిమ్మదిరుగుచు, ముణుంగుచు లేచుచు నీవిధంబై యున్నది, హరీ, నాథా నన్ను కావుమీ. ఈ దేహం బనెడులంకపై దండు దిగి, చి త్తమనెడు నింద్రజిత్తుపై రణించి, దుర్బుద్దులనెడు దుర్మార్గపురాక్షసుల హతము సేసి,