పుట:Shriiranga-mahattvamu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

139


బొడవులై పొలుపారు పులినస్థలంబులు
క్రందుగా నందందఁ గానవచ్చె


తే.

నదరుచూడ్కికి వెక్కసం బైనపఱపు
తెల్లముగఁ దోన జువ్వనఁ దీసిపోయె
నల్పజలజంతు నికరంబు లచట నచట
నదరె శైవాలపంక్తుల నాక్షణంబ.

220


తే.

అంతఁ దత్తీర్థసంరక్షణార్థ మచట
మెలఁగు శ్రీవిష్ణుభూతేశు లలఘుమతులు
మున్ను దఱులకు మిగిలి యుప్పొంగి పాఱు
నమ్మహానది యల్పాంబు వగుటఁ జూచి-

221


క.

సరభసగతిఁ దత్కారణ
మరయుచు నటపోయి బాడబానలశిఖలం
బొరి నదుకు జలధిరవమునఁ
బరగెడు నొకమ్రోఁత వినిరి పడమటివంకన్.

222


చ.

విని యిది యేమియో యనుచు విస్మితులై చని యమ్మహాతరం
గిణి యుభయప్రతీరములఁ గ్రిక్కిఱియంబడి యానతాస్యులై
ఘనరసపూరముల్ బహుముఖంబులఁ గ్రోలెడివారి నుగ్రని
స్వన బధిరీకృతాశుల బిశాచగణంబుల ఘోరమూర్తులన్.

223


చ.

కని-కడునల్గి బిట్టదఱి కన్నుల దిట్టఁపుకెంపు బర్వఁ ద
ర్జనములు-గర్జనంబులు విశంకటభంగిఁ జెలంగఁ దాఁకి క
న్కనిఁ బరిఘాసి చక్రశరఖడ్గగదాముసలాది ఘోరసా
ధనముల బిట్టు నొంపఁ గడు దల్లడ మందుచుఁ బాఱి రందఱున్.

224


క.

వారలతోడన తెరలి- కు
మారుండును బఱచె నీక్రమంబున భయముం
గూరిన వచ్చెడి తనపరి
వారము నీక్షించి వృషభవాహనుఁ డాత్మన్.

225