పుట:Shriiranga-mahattvamu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

తృతీయాశ్వాసము


మణిరు గరుణితహరిదుదర దరవికచనఖకమల పరిమళపరిమిళిత నురుసరి
దతులసలిలకణగణకలిత బలకచభరరుచినిచయ ఖచితగగనగతిరహిత
మహితనిపతిత మఘమలితచలితమతిదయ వివశమశరణభువభవ పాహిమాం!
పాహిమాం!

215


వ.

అని సన్నుతించినఁ బ్రసన్నుండై విపన్నగాశని యగుపన్నగాభరణుం
డతనిపైఁ గృపాతరంగితం బగునపాంగంబు నిగిడించి నీ తలం పెయ్యది
చెప్పుమనిన నప్పశుపతికి నందంద వందనం బాచరించి కృతాంజ
లియై యాచిత్రసేనుండు తనవృత్తాంతం బంతయు విన్నవించినఁ దత్పతన
కారుల నిరూపించి విరూపాక్షం డాక్షణంబున నిజకింకరగణంబుల రణంబున
కాజ్ఞాపించిన—

216


శా.

బాహాకంపితహేతిదీప్తులు వియద్భాగంబు గప్పన్ సము
త్సాహోదంచితసింహనాదముల దిక్చక్రంబు భేదిల్లఁ గా
సాహంకారభయంకరాకృతులతో సాయోధనోదగ్ర-స
న్నాహం బద్భుత మావహింప వెడలెన్ మాహేశభూతావళుల్.

217


శా.

చంచద్వాహనకేకిపింఛరుచు లాశామండలం బెల్లఁ జి
త్రించెన్, రోహణశృంగరాజములభాతిన్ రత్నకోటీరముల్
మించెం బాశశరాదిసాధనము లోలిం బూచి దర్పంబునం
గ్రౌంచారాతియు బల్వడిన్ వెడలె సంగ్రామక్రియాలోలతన్.

218


వ.

ఇ ట్లరిగి సకలదురితలతాలవిత్రం బగుశ్రీరంగక్షేత్రంబుఁ బ్రవేశించి
యందు నిరర్గళాపవర్గకరవారి యగుకావేరిం జేరి యాభూతజాలంబు నానా
ముఖంబులఁ దజ్జలంబు చలంబునఁ గ్రోలం దొడంగిన-

219


సీ.

అంత నిర్మగ్నంబు లైనమహీధర
ప్రతతి శృంగంబులు బయలువడియె,
నీరం దేలెడి తీరభూరుహప్రసవంబు
లంతరిక్షమున దూఁగాడఁ దొడఁగె
నవ్యంబులైన నిమ్నప్రదేశంబులు
రయమేది నమ్రతరంబు లయ్యె,